ఉబర్, ఓలా తరహాలో మెషినరీ సేవలు అందించాలి

ఉబర్, ఓలా తరహాలో మెషినరీ సేవలు అందించాలి

గజ్వేల్, వెలుగు:  వ్యవసాయంలో టెక్నాలజీ వాడకం పెరగాలని, ఉబర్, ఓలా తరహాలో పంట పొలాల్లో మెషినరీ సేవలు అందించినప్పుడే ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి అన్నారు. ఈ దిశగా రైతులను చైతన్యపరిచేందుకు ఐటీ శాఖ సాయం తీసుకోవాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలకు సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగులోని ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్​ యునివర్సిటీలో నిరంజన్​రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం జరిగింది. రాష్ట్రంలో కంట్రోల్ బియ్యం కోసం ఎదురుచూసిన పరిస్థితి నుంచి తెలంగాణలో ఉత్పత్తి అయిన వడ్లు కొనలేక కేంద్రం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని నిరంజన్​రెడ్డి అన్నారు. వానాకాలంలో రైతులు పత్తి సాగుపై దృష్టి పెట్టాలన్నారు. డిమాండ్​ఉన్న పప్పుదినుసులు, నూనె గింజల పంటలను సాగు చేయాలని, అలాంటి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

చైనా, ఇజ్రాయెల్​సాగు విధానాలను స్టడీ చేయాలె: మంత్రి కేటీఆర్

పంటల సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ, వ్యవసాయ వర్సిటీ అధికారుల ఆలోచనా విధానం మారాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వ్యవసాయంలో రైతుకు ఆదాయం ఎలా వస్తుందో ఆలోచన చేయాలని, చైనా, ఇజ్రాయెల్ లో అవలంభిస్తున్న విధానాలను స్టడీ చేయాలన్నారు. వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తే యువత ఆ దిశగా మళ్లే అవకాశం ఉందన్నారు. కొత్తతరం సాగులోకి వస్తే పాత, కొత్త అనుభవాలతో ఒక కొత్త విధానం తీసుకురావచ్చన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేయాలన్నారు. శాస్త్రవేత్తలు వడగండ్లు, అకాల వర్షాలను తట్టుకునే వంగడాలను తయారు చేయాలన్నారు. ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా పంటలు యూనిట్ గా బీమా కంపెనీలతో మాట్లాడి కొత్త విధానం తీసుకురావాలని కేటీఆర్​ సూచించారు.

కొత్త రకం పంటపై దృష్టి పెట్టాలి: మంత్రి మేముల

కొత్త రకం పంటలపై రైతులు దృష్టి పెట్టాలని, అందుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఈ ఏడాది మిరపలో తామరపురుగు, గతేడాది పత్తిలో గులాబీ పురుగులు రైతులను దెబ్బతీశాయని, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులకు సాంకేతిక సాయం అందించాలని మంత్రి పువ్వాడ అజయ్​ అన్నారు. ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయి సందర్శనకు పంపిస్తున్నామని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరీకల్చర్ సాగు ప్రోత్సహించాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. యాసంగిలో నూక శాతం తగ్గే వంగడాలను రూపొందించాలని, 25 నుంచి 26 శాతం తేమ ఉన్నప్పుడే వరి కోతలు పూర్తి చేస్తే మిల్లింగ్ కు వచ్చే వరకు నూక శాతం తక్కువ ఉంటుందని గంగుల కమలాకర్ చెప్పారు. మార్కెటింగ్​కు గ్యారంటీ ఉన్నందునే రైతులు వరి, పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారని జగదీశ్​ రెడ్డి అన్నారు.