రేవంత్​తోనే కాంగ్రెస్​కు ప్రమాదం : సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి

రేవంత్​తోనే కాంగ్రెస్​కు ప్రమాదం : సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి
  • రేవంత్​తోనే కాంగ్రెస్​కు ప్రమాదం
  • కాంగ్రెస్ నేత సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి
  • పార్టీని నాశనం చేయాలని చూస్తున్నడని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీకి రేవంత్​ వల్ల ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ ఉప్పల్​ నియోజక వర్గం బి–బ్లాక్​ అధ్యక్షుడు, సీనియర్​ నేత సింగిరెడ్డి సోమశేఖర్​ రెడ్డి ఆరోపించారు. పార్టీని నాశనం చేయాలనే రేవంత్ కంకణం కట్టుకున్నారని అన్నారు. ఆదివారం ఆయన కార్పొరేటర్​ శిరీషతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉప్పల్​ సెగ్మెంట్​ నుంచి సోమశేఖర్​ రెడ్డి పార్టీ టికెట్​ను ఆశించారు.

మొదటి విడతలో ఆయనకు కాకుండా పరమేశ్వర్​ రెడ్డికి కేటాయించారు. దీంతో రేవంత్​పై సోమశేఖరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను 30 ఏండ్లుగా కాంగ్రెస్​ని నమ్ముకుని అనేక హోదాల్లో పని చేశానని గుర్తుచేశారు. పార్టీకి కట్టుబడి పని చేసిన తనకు టికెట్​ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవే దన వ్యక్తం చేశారు. పార్టీ తనకు టికెట్​ ఇవ్వక పోవ డంతో తాను, తన సతీమణి శిరీష రాజీనామా చేస్తున్నట్టు ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు లేఖ పంపినట్లు తెలిపారు. 

అధికారమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తడు.. 

రేవంత్​కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తారని సోమశేఖర్​ విమర్శించారు. ఉప్పల్​లో డమ్మీ అభ్యర్థిని పెట్టి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు రేవంత్​ కుట్ర చేస్తున్నారన్నారు. ‘‘ఉప్పల్​లో కాంగ్రెస్​ గెలిస్తే ఆస్తి రాసిస్తా. నేను రేవంత్ రెడ్డికి సన్నిహితుడిని. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీతోనే ఉన్న.2014లో టికెట్ అన్నరు. ఆ తర్వాత 2018లో అన్నరు. ఇప్పుడు కూడా ఇవ్వలేదు. కనీసం సెకండ్ ఆప్షన్ గా కూడా నా పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదు”అని సోమశేఖర్ వాపోయారు.

తన అడుగులు రేవంత్​ పతనం వైపేనని, పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో రేవంత్​ హఠావో, కాంగ్రెస్​ బచావో అనే నినాదంతో పర్యటిస్తానని తెలిపారు. తెలంగాణలో రేవంత్​ చేస్తున్న అక్రమాలపై ఖర్గేకు లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.