ఈ టీ పొడి ధర కిలో లక్షన్నర

 ఈ టీ పొడి ధర కిలో లక్షన్నర

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​ సిటీ..  చాయ్​కి ఎంతో ఫేమస్. గల్లీగల్లీకో టీ స్టాల్ ఉంటుంది. ఇరానీ చాయ్ తో పాటు ఎన్నో రకాల టీలను సిటీలో రుచి చూడొచ్చు. మాములుగా అయితే రూ.10 నుంచి రూ. 20కి సింగిల్ టీ  దొరుకుతుంది. కానీ అక్షరాలా రూ.1000కి ఒక కప్పు చాయ్ గురించి విన్నారా?   ఈ టీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందంటున్నారు తయారీదారులు. సిటీలో రెండు చోట్ల మాత్రమే ఈ అరుదైన కాస్ట్​లీ చాయ్​ అందుబాటులో ఉంది. కేఫ్ నిలోఫర్ బ్రాంచుల్లో మాత్రమే.. సిటీలోని బంజారాహిల్స్, హిమాయత్​నగర్‌‌‌‌ లోని కేఫ్ నిలోఫర్ ప్రీమియం లాంజ్‌‌లలో ఈ కాస్ట్​లీ చాయ్​ను టేస్ట్ చేయొచ్చు. ఈ ప్రత్యేకమైన చాయ్​ని రూ.వెయ్యికి ఒక కప్పు చొప్పున అమ్ముతున్నారు. అంత రేటున్నా జనాలు కొని తాగుతున్నారంటే టేస్ట్‌‌ ఏ లెవెల్‌‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2021 నుంచి సిటీలోని ఈ రెండు బ్రాంచుల్లో ఈ చాయ్​ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వాడే టీ పౌడర్‌‌‌‌లోనే ఉంది అసలు కథంతా. ఈ టీ పొడి ధరే కిలోకి లక్షన్నర. అది కూడా అంత ఈజీగా దొరకదు. వేలంలో పాల్గొని దక్కించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏడాది ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

పాలు లేకుండా చాయ్..

ఈ చాయ్‌‌ని పాలు పోయకుండా తయారు చేస్తారు. టీ పొడిని డికాక్షన్‌‌గా చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తుంటారు. ఒక కప్పు టీ కోసం నాలుగు గ్రాముల పొడిని ఉపయోగిస్తున్నారు. జనవరిలో జరిగిన వేలం పాటలో ఈ టీ పొడి​ని సొంతం చేసుకోగా.. అప్పటి నుంచి కస్టమర్ల రెస్పాన్స్ పెరిగిందని బంజారాహిల్స్ కేఫ్ నిలోఫర్ మేనేజర్ అన్వేశ్ తెలిపారు. తమ వద్దకు వచ్చే ప్రీమియం కస్టమర్లు ఈ వెయ్యి రూపాయల టీని ఇష్టంగా తాగుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం టీ పొడి అయిపోయే దశకు చేరిందని చెప్పారు.

అరుదైన తేయాకు మొగ్గల నుంచి.. 

అసోంలోని బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతం మైజాన్‌‌ టీ తోటల్లోని గోల్డెన్‌‌ టిప్స్‌‌గా పేరొందిన తేయాకు మొగ్గల నుంచి ఈ  టీ పొడిని తయారు చేస్తుంటారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ మొగ్గలు లభిస్తాయి. సూర్యోదయానికి ముందే వీటిని కోసి ఆరబెట్టి పొడిగా చేస్తారు. అరుదుగా లభించే ఈ మొగ్గల పొడి కిలో నుంచి కిలోన్నర మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అందుకే దీనికి ఎంత ధరైనా పెట్టేందుకు టీ తయారీదారులు వెనుకాడటం లేదు. తయారీ తర్వాత ప్రతి ఏటా ఈ పొడిని ఆన్​లైన్‌‌లో వేలం వేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ వేలం పాటలో పాల్గొనవచ్చు. అందులో నెగ్గిన వారికి ఈ టీ పొడిని కొరియర్ ద్వారా పంపిస్తారు. 2021లో కేఫ్ నిలోఫర్ యజమాని  రూ.75 వేలకు ఈ టీ పొడిని సొంతం చేసుకున్నారు. 2022లో కుదరకపోగా మళ్లీ ఈ ఏడాది జనవరిలో లక్షన్నర పెట్టి కిలోన్నర పొడిని కొన్నారు.