హైదరాబాద్, వెలుగు: ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఇప్పుడే స్టే ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. అప్పీల్ పిటిషన్లు విచారణ దశలో ఉండగా స్టే అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం, సిట్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వేర్వేరుగా వేసిన అప్పీల్ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. 4 గంటలకు పైగా వాదనలు జరిగాయి. వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ దుష్యంత్ దవే కల్పించుకొని సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. స్పందించిన కోర్టు.. అప్పీల్ పిటిషన్లపై విచారణ జరుగుతుండగా స్టే అవసరం లేదని చెప్పింది.
