
- నిర్మాణాలు, ఇతర సేవల కోసం ఒకే వేదికపై దరఖాస్తు విధానం తీసుకురావాలి
- అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ( తెలంగాణ కోర్అర్బన్ ఏరియా) పరిధిలో వివిధ రకాల నిర్మాణాలు, ఇతర సేవల కోసం ఒకే వేదికపై దరఖాస్తు చేసుకునే విధానం తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో ద్వారా లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం రెవెన్యూ, పురపాలక, జలవనరులు, నీటి సరఫరా, మురుగు నీటిపారుదల, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బుధవారం సెక్రటేరియెట్లో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పౌర సేవలు, అనుమతులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పరిధిలో వివిధ రకాల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని అన్నారు. ఈ మేరకు పూర్తి అధ్యయనంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సూచించారు.
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వివిధ రకాల నిర్మాణాల కోసం ప్రజలు పలు విభాగాలకు దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని అన్నారు. ఏదైనా నిర్మాణం లేదా గృహాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన సేవల కోసం ఒకే వేదికపై దరఖాస్తు చేసుకుంటే సింగిల్ విండోలో అనుమతులు వచ్చేలా చూడాలన్నారు. ఆయా శాఖలు వసూలు చేసే బిల్లులను కూడా ఒకేసారి, ఒకే విండో ద్వారా చెల్లించే విధానం ఉండాలన్నారు. వినియోగదారులు చెల్లించే మొత్తాన్ని సంబంధిత విభాగాల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని రూపొందించాలని సూచించారు.
అనుమతుల్లో జాప్యం వద్దు
ఆస్తులు, వనరుల గుర్తింపునకు లైడార్ సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మరింత సులభతర విధానాల అధ్యయనానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. పౌర సేవలు మెరుగ్గా అందేందుకు వివిధ శాఖల విభజనలో ఏకరూపత ఉండాలని అభిప్రాయపడ్డారు. అనుమతుల ప్రక్రియలో అనవసర జాప్యం చేయకూడదని, సరైన కారణం లేకుండా అనుమతులు నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఏదైనా కారణంతో అనుమతులకు ఆలస్యమైతే, అందుకు గల కారణాలను దరఖాస్తుదారులకు తెలియజేసి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులే సూచించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, మూసీ రివర్ డెవలప్‌మెంఈట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.