
మెదక్ జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగూరు డ్యాం పూర్తిగా నిండినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకులోకి 12 వేల క్యూసెక్కులు వరద నీరు వస్తున్నట్లు చెప్పారు. డ్యాం పూర్తిగా నిండటంతో ఇవాళ (శనివారం, సెప్టెంబర్ 13) ఏ సమయంలోనైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తు చాన్స్ ఉందని వెల్లడించారు.
గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల వారు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పశువులు, గొర్ల కాపరులు, చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని హెచ్చరించారు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.
మెదక్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో గత రెండు కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మెదక్ టౌన్‌లో కేవలం గురువారం (సెప్టెంబర్ 11) ఒక్క రోజు 3 గంటల వ్యవధిలోనే 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజ్‌పల్లిలో 13.4, కొల్చారంలో 8.8, పాతూరులో 8.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.
శుక్రవారం కూడా అదే మాదిరిగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు లోకి భారీ గా వరద నీరు వచ్చి చేరుతోంది.