తుర్కియేకు సిన్వర్ భార్య ఎస్కేప్.. మళ్లీ పెండ్లి చేసుకుని అక్కడే సెటిల్

తుర్కియేకు సిన్వర్ భార్య ఎస్కేప్.. మళ్లీ పెండ్లి చేసుకుని అక్కడే సెటిల్

టెల్ అవీవ్: గాజాలో ఇజ్రాయెల్ బలగాల దాడిలో హతమైన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ భార్య సమర్ ముహమ్మద్ అబూ జమార్ తుర్కియేలో ఉన్నట్టు ఇజ్రాయెల్ మీడియా సంస్థ ‘వైనెట్’ వెల్లడించింది. సిన్వర్ మృతికి ముందే ఆమె ఫేక్ పాస్ పోర్టుతో పిల్లలతో సహా గాజా నుంచి ఎస్కేప్ అయినట్టు తెలిపింది. రఫా బార్డర్ ద్వారా ఈజిప్టు మీదుగా ఆమె తుర్కియేకు చేరుకుని ఉంటుందని పేర్కొంది.

సిన్వర్ మరణించిన తర్వాత ఆమె తుర్కియేలో మళ్లీ పెండ్లి చేసుకున్నట్టుగా కూడా తెలిసిందని వివరించింది. గాజా నుంచి హమాస్ అగ్ర నేతల భార్యలు, పిల్లలను ఫేక్ డాక్యుమెంట్లతో ముందస్తుగానే విదేశాలకు తరలించారని, ఈ విషయంలో హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ ఆఫీసర్ ఫతీ హమాద్ కీలక పాత్ర పోషించాడని వెల్లడించింది. 

ఇజ్రాయెల్ దాడులతో బీభత్సపూరితమైన వాతవరణం ఉన్న గాజా నుంచి అత్యున్నత స్థాయిలో సహకారం, పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లేనిదే ఇంత ఈజీగా వారు ఎస్కేప్ అయ్యే పరిస్థితి లేదని తెలిపింది. 2024, అక్టోబర్ 16న సిన్వర్ మరణించిన తర్వాత ఆమె తుర్కియేలో మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్టుగా పేర్కొంది. అలాగే సిన్వర్ తర్వాత కొన్నిరోజులు హమాస్ పగ్గాలు చేపట్టిన అతడి తమ్ముడు మొహమ్మద్ కూడా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడు. మొహమ్మద్ భార్య నజ్వా కూడా అతడి మరణానికి ముందే గాజా నుంచి ఈజిప్టు మీదుగా ఇలాగే ఎస్కేప్ అయినట్టుగా వైనెట్ తెలిపింది. 

కాగా, 2024, అక్టోబర్ 16న రఫాలోని టల్ అల్ సుల్తాన్ ఏరియాలో ధ్వంసమైన ఓ బిల్డింగ్ లో సిన్వర్‎ను ఇజ్రాయెల్ బలగాలు గుర్తించాయి. శరీరంపై గాయాలతో కుర్చీలో నిస్సహాయంగా కూర్చుని ఉన్న సిన్వర్ వైపు ఇజ్రాయెల్ డ్రోన్ వెళ్లగా.. ఆయన ఓ కర్రతో దానిని కొట్టేందుకు ప్రయత్నించడం, ఆ వెంటనే కాల్పులు, బాంబుదాడి జరగడానికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. తలపై బులెట్ గాయంతో పాటు బాంబు పేలుడు వల్ల శకలాలు వచ్చి తాకి తీవ్ర గాయాలు కావడంతో సిన్వర్ మరణించినట్టు వెల్లడైంది.

గాజాలో రోజూ 10 గంటలు కాల్పులు బంద్ 

నిరంతర దాడులతో గాజాలో ప్రజలు ఆకలి కేకలతో అలమటించాల్సి వస్తోందంటూ అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాల్పులకు స్వల్పంగా విరామాలు ఇస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆదివారం నుంచి గాజాలో అత్యధిక జనం ఉంటున్న గాజా సిటీ, డీర్ అల్ బలాహ్, మువాసీ ప్రాంతాల్లో రోజూ 10 గంటల పాటు కాల్పులు నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ మూడు ప్రాంతాల్లో కాల్పులు ఆపివేస్తున్నామని పేర్కొంది.

అయితే, ఇజ్రాయెల్ ప్రకటనకు ముందు ఆదివారం జరిపిన దాడుల్లో మరో 27 మంది పాలస్తీనియన్లు చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. కాగా, 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 1200 మంది చంపి, వందలాది మందిని బందీలుగా తీసుకెళ్లారు. హమాస్ దాడికి ప్రతీకారంగా 21 నెలలుగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఇప్పటివరకూ గాజాలో 59 వేల మంది చనిపోయారు. లక్షలాది మంది నిత్యం ఆకలితో అలమటిస్తున్నారు.