12 రాష్ట్రాలు, యూటీల్లో సర్ ..రెండో దశలో నిర్వహణకు ఈసీ ప్రకటన

12 రాష్ట్రాలు, యూటీల్లో సర్ ..రెండో దశలో నిర్వహణకు ఈసీ ప్రకటన
  • రెండో దశలో నిర్వహణకు ఈసీ ప్రకటన
  • నవంబర్ ​4 నుంచి డిసెంబర్​ 4 వరకు సర్వే
  • డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9న ముసాయిదా జాబితా విడుదల
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి  7న ఫైనల్‌‌‌‌ ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌ ప్రచురణ 
  • 2026లో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లోనూ నిర్వహణ
  • ‌‌‌‌‌‌‌మొదటి దశ బిహార్‌‌‌‌‌‌‌‌లో విజయవంతమైంది
  • నకిలీ ఓట్లను తొలగించడమే ‘సర్’ లక్ష్యమని ఈసీ వెల్లడి


న్యూఢిల్లీ:  కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది. రెండో దశలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో  ఓటర్ల జాబితా స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్‌‌ (సర్‌‌‌‌)ను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. చీఫ్‌‌ ఎలక్షన్ కమిషనర్‌‌‌‌ (సీఈసీ) జ్ఞానేశ్‌‌ కుమార్​ మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండో విడత ‘సర్‌‌‌‌’ నవంబర్ 4 న ప్రారంభించి డిసెంబర్​4  నాటికి ముగిస్తామని తెలిపారు. డిసెంబర్‌‌‌‌ 9న ముసాయిదా ఓటర్ల జాబితా, ఫిబ్రవరి 7న తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. తొలిదశలో బిహార్‌‌లో ‘సర్’ విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపారు. అక్కడ ఎలాంటి ఫిర్యాదులు, అప్పీళ్లు లేకుండా ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ‘సర్‌‌‌‌’లో పాల్గొన్న 7.5 కోట్లమంది బిహార్ ప్రజలకు  ధన్యవాదాలు తెలిపారు. రెండోదశలో సర్‌‌‌‌ నిర్వహించనున్న 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను వెల్లడించారు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్, చత్తీస్‌‌గఢ్‌‌, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్తాన్‌‌, తమిళనాడు, యూపీ, బెంగాల్‌‌లో జరగనున్న సెకండ్​ ఫేజ్‌‌లో 51 కోట్లమంది ఓటర్లు భాగం కానున్నారని తెలిపారు. ఇందులో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, వెస్ట్​బెంగాల్‌‌లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. అలాగే, ఇదే ఏడాదిలోనే ఎలక్షన్స్‌‌ జరగనున్న అస్సాంలో విడిగా ఓటరు జాబితా సవరణ నిర్వహిస్తామని వివరించారు. 

స్వాతంత్ర్యం వచ్చాక ఇది తొమ్మిదోది..

 ఫేజ్‌‌-2 ‘సర్‌‌’‌‌ నిర్వహణ కోసం పోలింగ్ అధికారులకు మంగళవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని సీఈసీ జ్ఞానేశ్‌‌ కుమార్​ తెలిపారు. మొదటిదశ అనంతరం 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులతో ఈసీ సమావేశాలు నిర్వహించి, సమగ్రంగా చర్చించిందని చెప్పారు. ఈ ప్రక్రియలో బీఎల్‌‌వోలు కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. బూత్​స్థాయి నుంచి ఓటర్​జాబితాల ప్రక్షాళన చేస్తున్నట్టు తెలిపారు. సర్‌‌‌‌ తర్వాత అభ్యంతరాలుంటే వెబ్‌‌సైట్‌‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ‘‘స్వాతంత్ర్యానంతరం 1951 నుంచి ఓటరు జాబితా సవరణను ఎనిమిది సార్లు నిర్వహించాం. 2002–-2004లో చివరిసారిగా ఈ ప్రక్రియ జరిగింది. వలసలు, నకిలీలు, 2002 నుంచి నమోదిత ఓటర్లు ఎవరైనా మరణించి ఉండటంలాంటి కారణాలతో ‘సర్’ నిర్వహించడం తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న సవరణ తొమ్మిదోది” అని వివరించారు.  కాగా, పౌరసత్వానికి ఆధార్ ఒక ధ్రువీకరణ పత్రం కాదని, అయితే ‘సర్’లో దానిని ఒక ఐడెంటిటీ ప్రూఫ్‌‌గా సమర్పించవచ్చని  చెప్పారు.