మోదీని ఎదుర్కోలేక  ఈసీపై  నిందలా? కేంద్ర మంత్రి  బండి సంజయ్ ఫైర్

మోదీని ఎదుర్కోలేక  ఈసీపై  నిందలా?  కేంద్ర మంత్రి  బండి సంజయ్ ఫైర్
  •  
  • ఓటరు జాబితా పవిత్రత కోసమే ‘సర్’
  • తెలంగాణ, హిమాచల్​లో కాంగ్రెస్ 
  • గెలిచినప్పుడు ఈసీ తీరు బాగానే ఉందా?
  • సర్ ప్రక్రియను సుప్రీం కోర్టు సమర్థించింది
  • అమలు చేసేది రాష్ట్ర అధికారులేనని వ్యాఖ్య

 
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఎన్నికల సంఘం (ఈసీ), ఈవీఎంలపై కాంగ్రెస్ నాయకులు నిందలు వేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  డిమాండ్ చేయడం సిగ్గుచేటని, ఇది ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రజలు వరుసగా మూడుసార్లు గెలిపించినందుకు ప్రధాని మోదీ రాజీనామా చేయాలా..? దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని, భారతీయుల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నందుకు రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వాన్ని బ్రిటీష్ పాలనతో పోల్చడం భారత ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ఓటమికి ఎన్నికల కమిషనర్లను, ఈవీఎంలను బాధ్యులను చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌‌లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు, ఈసీ తీరు బాగానే ఉన్నాయా? అని ప్రశ్నించారు.


ఓటరు జాబితా పవిత్రత కోసమే ‘సర్‌‌’..


ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌‌) ప్రక్రియ కొత్తదేమీ కాదని, గతంలోనూ దీన్ని నిరంతరం కొనసాగించారని బండి సంజయ్ గుర్తుచేశారు. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రక్రియను సమర్థించిందని చెప్పారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులేననే సోయిలేకుండా కేంద్రంపై నెపం నెట్టడం దుర్మార్గమన్నారు. ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునే వ్యవస్థ ఉందని, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించామన్నారు. డూప్లికేట్ ఓట్లు, విదేశీ అక్రమ వలసదారుల పేర్లు జాబితాలో లేకుండా చేయాలనే ‘సర్‌‌’ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ధైర్యముంటే ‘సర్‌‌’ అమలులో జరిగిన తప్పిదాలకు సంబంధించిన ఆధారాలను కాంగ్రెస్ బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు.