క్రికెట్ వదిలేద్దామనుకున్నా : మహ్మద్ సిరాజ్

క్రికెట్ వదిలేద్దామనుకున్నా : మహ్మద్ సిరాజ్
  •     క్యాటరింగ్ చేసి రోజుకు రూ. 100-200 సంపాదించేవాడిని
  •     తన కష్టాలను గుర్తు చేసుకున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్ 

హైదరాబాద్: మహ్మద్ సిరాజ్. టీమిండియా స్టార్ క్రికెటర్లలో ఒకడు. హైదరాబాద్ గల్లీల్లో టెన్నిస్ బాల్‌‌‌‌‌‌‌‌తో  బౌలింగ్‌‌‌‌‌‌‌‌ నేర్చుకున్న ఈ కుర్రాడు తన  టాలెంట్‌‌‌‌‌‌‌‌తో వన్డేల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగాడు. అయితే,  ఓ దశలో తాను క్రికెట్‌‌‌‌‌‌‌‌ను వదిలేద్దామని అనుకున్నానని సిరాజ్ అంటున్నాడు.  బుధవారం 30వ బర్త్‌‌‌‌‌‌‌‌డే జరుపుకున్న ఈ హైదరాబాదీ బీసీసీఐ టీవీ రూపొందించిన ఓ వీడియోలో  తన ప్రయాణాన్ని, పేదరికం కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాడు.  

‘2019–-20లో నేను క్రికెట్‌‌‌‌‌‌‌‌ను వదిలేద్దామని అనుకున్నా.  ఆ  ఒక్క ఏడాది ఆడి మంచి కోసం ఆట నుంచి పక్కకు వెళ్దామన్న ఆలోచన వచ్చింది’ అని సిరాజ్ తెలిపాడు. కానీ, అదే ఏడాది ఇండియా వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌లోకి రావడంతో పాటు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లోనూ నిలదొక్కుకోవడంతో తను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే, కుటుంబ ఇబ్బందుల కారణంగా ఒక దశలో తాను క్యాటరింగ్ పనులు చేయాల్సి వచ్చిందని సిరాజ్ వెల్లడించాడు.

‘ఒకప్పుడు మేం కిరాయి ఇంట్లో ఉండేవాళ్లం.  ఇంట్లో వాళ్లు  నన్ను బాగా చదుకోవాలని చెప్పేవాళ్లు. నేనేమో క్రికెట్ ఆడేవాడిని. కుటుంబంలో మా నాన్న ఒక్కడే సంపాదించేవాడు. దాంతో  ఆయనకు సాయం చేసేందుకు నేను క్యాటరింగ్ పనికి వెళ్లేవాడిని. అలా వచ్చే రూ. 100 – 200తో చాలా సంతోషం కలిగేది. ఓ 50 రూపాయలు నేను ఉంచుకుని మిగతావి ఇంట్లో ఇచ్చేవాడిని.

క్యాటరింగ్ టైమ్‌‌‌‌‌‌‌‌లో రూమాలీ రోటీ తిప్పేటప్పుడు  చేతులు కాలేవి. అయినా నేను బాధపడలేదు.  ఇలాంటివి చాలా కష్టాలను దాటుకొని నేను ఈ స్థాయికి చేరుకున్నా.  మన కష్టం ఎప్పటికీ వృథా పోదు.  ఈ రోజు కాకపోతే రేపు.. ఈ ఏడాది కాకపోతే నాలుగు సంవత్సరాల్లో అయినా ఫలితం లభిస్తుంది’ అని సిరాజ్ అభిప్రాయపడ్డాడు.