రేకుల షెడ్లలో క్లాసులు.. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు..! సౌలతుల్లేని సిరిసిల్ల జేఎన్టీయూ కాలేజీ

రేకుల షెడ్లలో క్లాసులు.. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు..! సౌలతుల్లేని సిరిసిల్ల జేఎన్టీయూ కాలేజీ
  • డిగ్రీ కాలేజీలో నాలుగేండ్లుగా తాత్కాలికంగా క్లాసుల నిర్వహణ 
  • 1,032 మంది విద్యార్థులకు ఇద్దరే రెగ్యులర్ ఫ్యాకల్టీ
  • శాశ్వత భవనాలకు హామీ ఇచ్చి పట్టించుకోని కేటీఆర్  
  • డిగ్రీ కాలేజీకి అద్దె కట్టకపోవడంతో గదులకు తాళం 
  • ఇబ్బందులు తీర్చాలని రోడ్డెక్కి విద్యార్థుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల, వెలుగు: జేఎన్టీయూ అనుబంధ సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీలో అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1,032 మంది విద్యార్థులు చదువుకుంటుండగా రెగ్యులర్ ఫ్యాకల్టీలు లేరు. సరిపడా క్లాస్ రూమ్స్ లేవు. నాలుగేండ్లుగా డిగ్రీ కాలేజీలోనే నిర్వహిస్తున్నారు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థుల చదువులు సరిగా సాగడం లేదు. 

అద్దె కూడా చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీ క్లాస్ రూమ్స్‎కు తాళం వేశారు. 2021– -22 విద్యా సంవత్సరంలో ఆరు బ్రాంచ్‎లతో సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం డిగ్రీ కాలేజీలో తాత్కాలికంగా నిర్వహించుకునేందుకు ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది. 

అయితే.. రెండేండ్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వగా ఐదేండ్లుగా కొనసాగుతోంది. డిగ్రీ కాలేజీకి అద్దె  చెల్లించాలనే రూల్ ఉంది. అయితే.. 2023 నుంచి చెల్లించకపోతుండగా రూ. లక్షల్లో బకాయిలు ఉంది. దీంతో  డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శంకర్.. రెండు రోజుల కింద ఇంజనీరింగ్ కాలేజీ క్లాస్ రూమ్స్‎కు తాళం వేశారు. 

కేటీఆర్ హామీ ఇచ్చి.. 

డిగ్రీ కాలేజీలో తాత్కాలికంగా క్లాసులు నిర్వహిస్తామని, త్వరలోనే శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని అప్పటి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వెంటనే స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. దీంతో తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రతిపాదనలు పంపించారు.

సిరిసిల్ల నుంచి పదేండ్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన కేటీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టి కొత్త కాలేజీ నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐదేండ్లుగా డిగ్రీ కాలేజీలోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇద్దరే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండగా.. వీరిలో ఒకరు ప్రిన్సిపల్, మరొకరు ఈసీఈ ప్రొఫెసర్.  కాగా.. కాంట్రాక్ట్‎గా ఐదుగురు ప్రొఫెసర్లు, 40 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు.

16 క్లాస్ రూమ్స్ అవసరమవగా.. కేవలం ఆరు రూమ్స్‎లోనే నడిపిస్తున్నారు. ఇందులో ల్యాబ్‎లు లేవు. కాలేజీకి దూరంగా ప్రైవేటు బిల్డింగ్‏ల్లో హాస్టల్స్​నిర్వహిస్తున్నారు. రేకుల షెడ్డులో మెస్, మరో క్లాస్ రూమ్ ఏర్పాటుచేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. 

ప్రాక్టికల్స్ కోసం వేరే కాలేజీలకు.. 

కాలేజీలో కేవలం కంప్యూటర్ ల్యాబ్ మాత్రమే ఉంది. ప్రాక్టికల్స్ కోసం ఇతర ప్రాంతాల్లోని కాలేజీకి తీసుకెళ్తున్నారు. ఈసీఈ మెకానికల్ కోర్సు విద్యార్థులను కొండగట్టు జేఎన్టీయూ కాలేజీకి, సివిల్ కోర్సు విద్యార్థులను సమీపంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు తీసుకెళ్తున్నారు. మిగతా కోర్సులకు కూడా సరైన ల్యాబ్ సౌకర్యం లేదు. 

రోడ్డెక్కిన విద్యార్థులు

జేఎన్టీయూ సిరిసిల్ల కాలేజీని అరకొర వసతులతో నిర్వహిస్తుండగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సోమవారం విద్యార్థులు రోడ్డెక్కారు. అగ్రహారం రోడ్డుపైన కూర్చొని 2 గంటల పాటు ధర్నా చేశారు. కాలేజీకి శాశ్వత భవనాలు నిర్మించాలని, రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని, హాస్టల్‎లో సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.  దీంతో పోలీసులు వెళ్లి విద్యార్థులను సముదాయించిన ధర్నా విరమింపజేశారు..

ల్యాబ్‎లు లేవు.. దూరంగా హాస్టల్స్  

కాలేజీలో ల్యాబ్‎లు లేవు. ప్రాక్టికల్స్ కోసం కొండగట్టులోని కాలేజీకి తీసుకెళ్తున్నారు. హాస్టల్స్ కూడా కాలేజీకి దూరంగా ప్రైవేట్ బిల్డింగ్స్ లో నిర్వహిస్తున్నారు. దీంతో కాలేజీకి వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత భవనాలను నిర్మించాలి.  

- మానస, బీటెక్ థర్డ్ ఇయర్, జేఎన్టీయూ,సిరిసిల్ల  

ఆరు రూమ్స్ లోనే క్లాసులు  

కాలేజీ మొదలైనప్పటి నుంచి వసతులులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 16 క్లాస్ రూమ్స్ కావాల్సి ఉండగా... కేవలం 6 రూమ్స్ లోనే నడిపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కొత్త క్యాంపస్ ను వెంటనే నిర్మించాలి.  పర్మినెంట్ ఫ్యాకల్టీని నియమించాలి.  
- ఎండీ సమీర్, బీటెక్ థర్డ్ ఇయర్, జేఎన్టీయూ, సిరిసిల్ల