రాజన్నసిరిసిల్ల, వెలుగు: హైదరాబాద్ ఓఆర్ఆర్ పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి శనివారం సిరిసిల్లలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో పట్టణానికి చెందిన బొల్లి శివకుమార్, అతడి భార్య లాస్య, కూతురు రిషిత, బావ కోడం శ్రీనివాస్, అల్లుళ్లు కోడం కృష్ణచంద్ర, మాధవ్ అక్కడికక్కడే చనిపోగా, చెల్లెలు కోడం శ్వేత నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీలను బంధువులు స్వస్థలం సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటకు తరలించారు.
మృతదేహాల వద్ద గుండెలు పగిలేలా కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తుండగా, పట్టణ ప్రజలను ఈ ఘటన కలచివేసింది. ఆరు మృతదేహాలతో అంతిమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రిలో బొల్లి రాజు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చి, మృతులకు నివాళులు అర్పించారు.
