ఎస్‌‌ఎఫ్‌‌సీ చైర్మన్‌‌గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు

ఎస్‌‌ఎఫ్‌‌సీ చైర్మన్‌‌గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్‌‌ఎఫ్‌‌సీ) చైర్మన్‌‌గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం హైదరాబాద్‌‌ ఎర్రమంజిల్‌‌లోని ఎస్‌‌ఎఫ్‌‌సీ ఆఫీసులో రాజయ్యతో పాటు సభ్యులు రమేశ్‌‌, సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ బాధ్యతలు చేపట్టారు. ఎస్‌‌ఎఫ్‌‌సీ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

చైర్మన్, సభ్యులకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మత్ హుల్లా హుస్సేన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు గత సర్కారు నిధులివ్వకుండా నిర్వీర్యం చేసిందన్నారు. గత పదేండ్లు స్థానిక సంస్థలు నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా గ్రామాలు, స్థానిక సంస్థలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా లోకల్‌ బాడీలకు నిధులు, అధికారాలు కల్పించారని గుర్తుచేశారు.

స్థానిక సంస్థల నేతల్లో అధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్లే ఉన్నారని.. అయితే, నిధుల్లేక అభివృద్ధి జరగకపోవడంతో హామీలపై ప్రజలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్‌ఎఫ్‌సీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో వెంటనే కమిషన్‌కు చైర్మన్, సభ్యులను నియమించారన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఈ పదవి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.