
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన లావణ్య
- ఆరునెలలు అష్టకష్టాలు
- కేటీఆర్ చొరవతో విముక్తి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఏజెంట్ మాటలు నమ్మి గల్ఫ్‌కు పోయిన.. అక్కడ 18 గంటల పని.. అన్నం సక్కగ పెట్టరు.. జీతం సక్కగ ఇయ్యరు.. ఇదేందని అడిగితే కొడతరు.. ఎదురుతిరిగితే చంపడానికి కూడా తయారుగుంటరు.. ఏదో నేరం మీద కేసులు పెడతరు.. సౌదీలో చాలామంది తెలుగు ఆడవాళ్లు బాధలను బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నరు.. ప్రభుత్వానికి చెప్పుకున్నా.. ఫలితం ఉండదు.. ఎంబసీ ఆఫీసర్లు లెటర్ రాసి వదిలేస్తరు అంటూ తన గోస వెల్లబోసుకుంది రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన గల్ఫ్బాధితురాలు లావణ్య.సౌదీలో ఆరు నెలలు అష్టకష్టాలు పడి మంగళవారం తన సొంతూరుకు వచ్చింది. తనకు సాయం చేసిన కేటీఆర్‌కు, దాతలకు కృతజ్ఞతలు తెలిపింది.
ఏజెంట్ మోసం
మొదటిసారి 2015లో సౌదీకి వెళ్లిన లావణ్య 2016లో తిరిగివచ్చింది. అప్పటికీ అప్పులు తీరకపోవడంతో మళ్లీ ఆరు నెలల కింద ముంబాయికి చెందిన ఏజెంట్ షకిల్ద్వారా విజిట్ వీసా మీద నవంబర్13న మరోసారి సౌదీకి వెళ్లింది. అక్కడ ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. నెలకు రూ.1200 రియల్స్ జీతంగా మాట్లాడుకోగా కొంతకాలం బాగానే ఉన్న యజమాని ఇబ్బందులు పెట్టాడు. తన వీసా గడువు (అఖామా) ముగియడంతో తాను బయటకు వెళ్లలేని పరిస్థితిని ఆసరా చేసుకుని రోజుకు 18 గంటల పని చేయించాడని, అతని బంధువుల ఇండ్లల్లో కూడా పని చేయించాడని, తిండి కూడా సరిగా పెట్టలేదని వాపోయింది. మూడు నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో ముంబైలోని ఏజెంటుకు చెప్పానని, దాంతో తన యజమాని తనను దారుణంగా కొట్టడంతో చేతికి గాయాలయ్యాయంది. తన తండ్రికి గుండెపోటు వచ్చిందని, ఆపరేషన్ కోసం డబ్బులు అవసరమని చెప్పినా ఇవ్వకుండా శారీరకంగా హింసించాడని తెలిపింది. తనను చంపేసి, వేరే వాళ్లతో లేచిపోయిందని అక్కడి పోలీసులకు చెబుతానని బెదిరించారని వాపోయింది. తన బాధలను కుటుంబ సభ్యులకు, కేటీఆర్‌కు వాట్సప్‌ద్వారా పంపినట్టు పేర్కొంది.
కేటీఆర్ సర్ స్పందనతోనే ..
తన గురించి తెలుసుకుని కేటీఆర్ట్విట్టర్లో పెట్టాడని, దీంతో సౌదీ ఎంబసీ అధికారులు తన యజమాని మీద కేసు పెట్టారని, మరోసారి అతడు తనను కొట్టాడని వివరించింది. కేటీఆర్ సర్ పదేపదే ఆఫీసర్లతో మాట్లాడడం వల్ల తనకు చెర తప్పిందని పేర్కొంది. తన మూడు నెలల జీతం రూ.70 వేలు వదిలేసి ప్రాణాలతో బయటపడ్డానంది.
ఎన్ఆర్ఐ ఆర్థిక సాయం
ఎంబసీ అధికారుల కేసు పూర్తి కాకుండా లావణ్యను ఇండియా పంపాలంటే యజమాని డిపాజిట్ మొత్తాన్ని కట్టాల్సిఉంటుంది. సౌదీలోని తెలంగాణ సామాజిక కార్యకర్త శివాజీ ముంబాయ్ ఏజెంట్‌తో చర్చలు జరిపాడు. రూ.35 వేలు చెల్లిస్తే ఇండియాకు వెళ్లేందుకు అభ్యంతరం చెప్పబోమని యజమానితో ఏజంటు ద్వారా ఒప్పందం కుదిరింది. ఖతర్‌లో తెలంగాణ జాగృతి సభ్యుడు వికృతి రాజుగౌడ్ ఈమేరకు ఆర్థిక సాయం చేశారు.
కేటీఆర్ సారే ఆదుకోవాలి..
కేటీఆర్వల్లే నాకు పునర్జన్మ లభించింది. బీఎస్సీ నర్సింగ్చదివిన తనకు ఉపాధి చూపించాలి. దీంతో తల్లిదండ్రులను పోషించుకుంటూ చెల్లిని చదివించుకుంట. కేటీఆర్ సారే మాకు దారి చూపాలి.