సిర్పూర్​లో ఖాళీ కానున్న బీఆర్ఎస్​.. కాంగ్రెస్ లోకి కోనప్పై!

సిర్పూర్​లో ఖాళీ కానున్న బీఆర్ఎస్​.. కాంగ్రెస్ లోకి కోనప్పై!
  •     కారు దిగనున్న కోనప్ప
  •     ఈనెల 14న కాంగ్రెస్ పార్టీ​లోకి సిర్పూర్​ మాజీ ఎమ్మెల్యే
  •     సోదరుడు, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణా రావుతో కలిసి చేరిక
  •     సిర్పూర్​లో ఖాళీ కానున్న బీఆర్ఎస్​

ఆసిఫాబాద్ / కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్​ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప కాంగ్రెస్​లో చేరనున్నారు. బీఆర్ఎస్ ​పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఈనెల14న కాంగ్రెస్​లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులను ఆయన కలిశారు. సిర్పూర్​లో తన ఓటమికి  కారణమైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​తో  పొత్తు పెట్టుకున్న హైకమాండ్ ​తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేయకపోతే తానే గెలిచేవాడినని, తన ఓటమికి కారణమైన వ్యక్తితో కలిసి పని చేయడం ఇష్టం లేకనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

 ఇటీవలే కొనప్ప సోదరుడు, ఆసిఫాబాద్ ​జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చేరిక విషయమై చర్చించారు. ఈనెల 14 వ తేదీన కోనప్ప తన అనుచగణంతో, జడ్పీ చైర్మన్​, కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్, ఎంపీపీలు, జడ్పీటీసీలతో కలిసి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్నారు. కోనప్ప నిర్ణయంతో సిర్పూర్​లో ఒకప్పుడు బలంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఖాళీ కానుంది.