డబ్బు కోసం అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి

డబ్బు కోసం అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి

 

  •  పెండ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకు ప్రేమజంట ప్లాన్ 
  •   ఐదుగురు నిందితులు అరెస్ట్​.. రెండు కార్లు, స్కూటీలు, 7  సెల్​ఫోన్లు స్వాధీనం
  •   మీడియాకు వివరాలు వెల్లడించిన మాదాపూర్​ జోన్​ఇన్ చార్జ్​ డీసీపీ శ్రీనివాస్​ రావు

గచ్చిబౌలి, వెలుగు : ఓ ప్రైవేట్​ఎంప్లాయ్ కిడ్నాప్​కేసులో చెల్లినే ప్రధాన నిందితురాలు అని తేలింది. బాయ్​ఫ్రెండ్​ని పెండ్లి చేసుకొని లైఫ్​సెటిల్​అవుదామనుకుని డబ్బుల కోసమే కిడ్నాప్​చేయించింది. అతని భార్యకు ఫోన్​చేయించి రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్​చేసింది.  కిడ్నాప్ కేసులో సురేందర్ సోదరి, ఆమె బాయ్​ఫ్రెండ్​, మరో ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్​ చేశారు. మాదాపూర్​ జోన్​ఇన్ చార్జ్​డీసీపీ శ్రీనివాస్​రావు ఆదివారం గచ్చిబౌలిలోని తన ఆఫీసులో మీడియాకు వివరాలు తెలిపారు. నల్లగొండ్ల జిల్లాకు చెందిన గుర్రం సురేందర్​(35), నాగమణి దంపతులు కేపీహెచ్​బీకాలనీలో ఉంటూ జాబ్ చేస్తుండగా ఇరువురికి లక్షల్లో జీతం వస్తుంది. 

ఇటీవల అక్కడే వీరు కొత్త ఇల్లు కొని గృహప్రవేశం చేశారు. సురేందర్​బాబాయి కుమార్తె నిఖిత(22) కొండాపూర్​లోని ఓ ప్రైవేట్​హాస్టల్​లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో జాబ్ చేస్తుంది. అదే కంపెనీలో ఏపీలోని కృష్ణ జిల్లా పెద్దపులిపాకకు చెందిన వెంకటకృష్ణ(28) జాబ్ చేస్తున్నాడు. ఇరువురూ కొద్దికాలంగా ప్రేమించుకుంటుండగా, పెండ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. గతంలో వెంకటకృష్ణ గంజాయి, కిడ్నాప్​ కేసుల్లో  జైలుకు వెళ్లొచ్చాడు. జైలులో ఉండగా.. అత్తాపూర్​కు చెందిన సురేశ్​(31) పరిచయం అయ్యాడు. 

సురేష్​ తన వద్ద కిడ్నాప్​గ్యాంగ్ ఉందని చెప్పాడు. దీంతో వెంకటకృష్ణ, నిఖిత ఈజీగా మనీ సంపాదించి పెండ్లి చేసుకునేందుకు ప్లాన్​చేశారు. నిఖిత తన సోదరుడు సురేందర్​ను కిడ్నాప్​చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని వెంకటకృష్ణకు తెలిపింది. అతను పాత నేరస్తుడు సురేశ్ కు చెప్పగా తన ఫ్రెండ్స్ మెహిదీపట్నంకు చెందిన రాజు(20), రోహిత్​(19), కడ్తల్​కు చెందిన చందు, అత్తాపూర్​కు చెందిన వెంకట్​తో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేశాడు. సురేందర్ ఇంటివద్ద ఓ సారి కిడ్నాప్ కు రెక్కీ నిర్వహించి విఫలమయ్యారు.

మాట్లాడాలని చెప్పి బయటకు రప్పించి.. 

 కొద్దిరోజుల కిందట సురేందర్​తన భార్య, పిల్లలను ఖమ్మంలోని ఆమె పుట్టింటికి పంపాడు. ఇంట్లో అతడు ఒక్కడే ఉండగా కిడ్నాప్​చేసేందుకు ఈనెల 4న నిఖిత, వెంకటకృష్ణ కలిసి ఫోన్​చేశారు. నిఖిత తనను ఆఫీస్​లో ఒకరు వేధిస్తున్నారని, మాట్లాడాలని ​ఖాజాగూడ లేక్​వద్దకు రావాలని సురేందర్ కు చెప్పింది. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు అతడు​అక్కడికి వెళ్లి.. ఆమెతో మాట్లాడుతుండగా స్విఫ్ట్​ కారులో సురేశ్, రాజు, రోహిత్, చందు, వెంకట్​వచ్చి సురేందర్​ను బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే డయల్​100కి కాల్​చేశారు.  రాయదుర్గం పెట్రోలింగ్​పోలీసులు వెళ్లి నిఖితతో పాటు స్థానికులను ఆరా తీశారు. 

నిఖిత పోలీసు స్టేషన్ కు వెళ్లి కిడ్నాప్ కంప్లయింట్ చేసింది. మాదాపూర్​జోన్​పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సురేశ్​గ్యాంగ్​సురేందర్​ భార్య నాగమణికి ఫోన్ ​చేసి రూ. 2 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. వెంటనే ఆమె ఖమ్మం నుంచి సిటీకి వచ్చింది. అయితే.. కిడ్నాప్ చేసిన కారు ఔటర్​రింగు రోడ్డుపై నుంచి కడ్తల్​వైపు వెళ్తూ బ్రేక్​డౌన్​అయింది. మరో కారు పంపించాలని నిఖిత, వెంకటకృష్ణలకు సురేశ్​కాల్ చేశాడు. దీంతో సురేందర్​ఇంటికి వెళ్లి అతడి కారును తీసుకుని వెంకటకృష్ణ కడ్తల్ వెళ్లాడు. 

కిడ్నాపర్లకు అప్ డేట్ ఇస్తూ..

పోలీసులు, కుటుంబసభ్యులకు అనుమానం రానివ్వకుండా నిఖిత జాగ్రత్త పడుతూనే.. ఎప్పటికప్పుడు వివరాలను కిడ్నాపర్లకు చేరవేసింది. కడ్తల్​వద్ద వెంకటకృష్ణ కారు ఇవ్వగా, అదితీసుకుని సురేందర్ తో కిడ్నాపర్లు శ్రీశైలం వైపు వెళ్లారు. కారుని ఆత్మకూరు బైరుట్లీ చెక్​పోస్ట్​ వద్ద అటవీశాఖ అధికారులు ఆపి చెక్​ చేశారు. తనను హైదరాబాద్​లో కిడ్నాప్​చేసి తీసుకువస్తున్నారని సురేందర్ చెబుతుండగా..కారు దిగి  కిడ్నాపర్లు అటవీలోకి పారిపోయారు. అనంతరం సురేందర్​భార్యకు కిడ్నాపర్ సురేశ్​కాల్​ చేసి తమకు రూ. 20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. 

స్పాట్​కు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు శనివారం రాత్రి కిడ్నాపర్లు సురేశ్, వెంకటకృష్ణ, రాజు, రోహిత్​ను అదుపులోకి తీసుకొని సిటీకి వచ్చారు. తొలి నుంచి నిఖితను అనుమానించిన రాయదుర్గం పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. సెల్​ఫోన్ ​డేటా ఆధారంగా కిడ్నాప్ ​ప్లాన్ బయటపడింది. నిఖిత, వెంకటకృష్ణ, కిడ్నాపర్లు సురేశ్, రాజు, రోహిత్​లను అరెస్ట్​ చేశారు. మరో ఇద్దరు నిందితులు చందు, వెంకట్​లు పరారీలో ఉన్నారు. రెండు కార్లు, రెండు స్కూటీలు, 7 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్​, రాయదుర్గం ఇన్​స్పెక్టర్​ మహేశ్​, గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​ జేమ్స్​బాబు, ఎస్​ఐలు ఉన్నారు