సిట్కు సృష్టి కేసు.. డాక్టర్ నమత్రపై 9 కేసులు రిజిస్టర్: డీసీపీ రష్మీ పెరుమాళ్

సిట్కు సృష్టి కేసు.. డాక్టర్ నమత్రపై 9 కేసులు రిజిస్టర్: డీసీపీ రష్మీ పెరుమాళ్

పద్మారావునగర్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ కేసును సిట్​కు బదిలీ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇక నుంచి సీసీఎస్ ఆధ్వర్యంలో పని చేసే సిట్​లోని పోలీస్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తారని చెప్పారు. ఇప్పటిదాకా ఈ కేసులో విచారణ జరిపిన అంశాలు, నిందితుల అరెస్ట్​ల గురించి డీసీపీ ఆఫీస్​లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు జులై 27న సికింద్రాబాద్​లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్​పై మొదటి కేసు నమోదైంది. తర్వాత బాధితులు వరుసగా గోపాలపురం పోలీస్ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఇలా మొత్తం సృష్టి సెంటర్ డాక్టర్ నమ్రతపై 9 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 25 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో నలుగురు డాక్టర్లతో పాటు ల్యాబ్ టెక్నిషియన్లు, మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఏజెంట్లు, బర్త్ పేరెంట్లు ఉన్నారు. దంపతులకు మాయ మాటలు చెప్పిన డాక్టర్ నమ్రత.. వారి వద్ద నుంచి లక్షలు వసూలు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. తన పేరుతో లెటర్ హెడ్స్​ను డాక్టర్ నమ్రత అక్రమంగా వాడుతున్నదని ఓ సీనియర్ గైనకాలజిస్ట్ ఫిర్యాదు చేశారు. వైజాగ్​కు చెందిన డాక్టర్ విద్యుల్లతతో పాటు డాక్టర్ రవి, డాక్టర్ ఉషను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్​లోని హాస్పిటల్​ను కేవలం కన్సల్టెన్సీగా వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఐవీఎఫ్ పేరుతో ఇక్కడ శాంపిల్స్ తీసుకుంటూ.. సరోగసీ ప్రాసెస్ అంతా వైజాగ్ నుంచి నడిపినట్టు స్పష్టమైంది.