- ప్రస్తుతం చంచల్‌గూడ జైలులోనే రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు
- నేటి ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కోర్టు అనుమతి
- మొదటి విడత 72 గంటల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన సిట్
- ఆరుగురు డ్రగ్స్ సప్లయర్ల చైన్ లింకులపై ఆరా, గోవా డీజే క్లింటన్ కోసం గాలింపు
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రోహిత్ రెడ్డి సహా ఆయన తమ్ముడు రితేశ్ రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను బుధవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మూడు రోజుల పాటు కస్టడీలో విచారించనుంది. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టు మంగళవారం సిట్‌కు అనుమతి ఇచ్చింది.
న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్న రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. బుధవారం 9 గంటలకు అదుపులోకి తీసుకుని శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయానికి తరలించనున్నారు.
16 రోజులుగా చంచల్‌గూడ జైలు రిమాండ్‌లోనే రోహిత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో మార్చి14న వీకెండ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఫారిన్ లిక్కర్‌తో పాటు కొకైన్, ఎమ్‌డీఎంఏ సహా మరో మూడు రకాల డ్రగ్స్ తీసుకుంటూ రోహిత్ రెడ్డి సహా మొత్తం 11 మంది పోలీసులకు చిక్కారు.
సోదాల సమయంలో పోలీసులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినందుకు గాను రోహిత్ రెడ్డి సహా ఆయన తమ్ముడు రితేశ్ రెడ్డి, ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ శర్మను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురిని కోర్టు అనుమతితో మార్చి 23 నుంచి మూడ్రోజుల పాటు మొదటిసారి కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రధానంగా ఫామ్‌హౌస్‌కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న పెడ్లర్ల వివరాలను రాబట్టారు. కాగా, ఈ కేసులో గత 16 రోజులుగా రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలుకే పరిమితమయ్యారు.
డ్రగ్స్ సప్లయర్లు సహా 16 మందికి చేరిన నిందితులు
ఫామ్‌హౌస్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీలకు గోవాకు చెందిన పబ్ డీజే క్లింటన్ అనే పెడ్లర్‌తో పాటు మరో ఆరుగురు సప్లయర్లు ఎమ్‌డీఎంఏ, కొకైన్ అందిస్తున్నట్టు కస్టడీ విచారణలో గుర్తించారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 16కు చేరింది. రోహిత్ రెడ్డి స్నేహితుడు డాక్టర్ బాలాజీ ద్వారా ఎమ్‌డీఎంఏ డ్రగ్స్ పార్టీకి సప్లయ్ చేసినట్టు సిట్ విచారణలో వెలుగు చూసింది.
దీంతో పాటు గోవాకు చెందిన డీజే క్లింటన్, పెడ్లర్లు అభిషేక్ సింగ్, రాకేశ్ శర్మతో రోహిత్ రెడ్డికి డ్రగ్స్ చైన్ లింకు ఉన్నట్టు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే డ్రగ్స్‌తో పాటు ఫామ్‌హౌస్‌లో కాల్పులకు సంబంధించిన వివరాలు, పార్టీలో పాల్గొన్న వారితో రోహిత్ రెడ్డి నిర్వహించే వ్యాపారాలపై సిట్ అధికారులు కూపీ లాగనున్నట్టు తెలిసింది.
