
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. 2025, ఆగస్ట్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని సిట్ కోరింది. ఈ మేరకు విచారణకు హాజరు అవుతానని సిట్‌కు బండి సంజయ్ రిప్లై ఇచ్చినట్లు తెలిసింది.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పలుమార్లు బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఫహీం ఖురేషి తదితర నేతల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. ఇందులో భాగంగా గతంలోనే బండి సంజయ్‌కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ముందస్తు షెడ్యూల్ వల్ల బండి సంజయ్ కు సిట్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగస్ట్ 8వ తేదీన విచారణకు హాజరు కావాలని తాజాగా సిట్ మరోసారి నోటీస్ జారీ చేసింది.