ఫాం హౌస్ కేసు : వైసీపీ ఎంపీ రాఘురామ కృష్ణంరాజుకు నోటీసులు

ఫాం హౌస్ కేసు : వైసీపీ ఎంపీ రాఘురామ కృష్ణంరాజుకు నోటీసులు
  • ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్‌‌
  • నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్‌‌ సంతోష్​, తుషార్‌‌‌‌, జగ్గుస్వామి, లాయర్‌‌‌‌ శ్రీనివాస్‌‌లను నిందితులుగా చేర్చాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్ట్‌‌ను ఆశ్రయించారు. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలతో పాటు ఈ నలుగురిని నిందితులుగా చేర్చాలని కోరుతూ గురువారం మెమో ఫైల్‌‌ చేశారు. మొయినాబాద్‌‌ పీఎస్‌‌లో నమోదైన ఎఫ్‌‌ఐఆర్‌‌ వివరాలను వెల్లడించింది ఈ మెమోపై శుక్రవారం ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. సిట్‌‌ కోరినట్టు ఈ నలుగురిని నిందితులుగా చేర్చేందుకు కోర్టు అనుమతిస్తే ఈ కేసు సంచలనంగా మారనుంది. ఇప్పటికే నమోదైన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లో నిందితులుగా చేర్చవచ్చు లేక సప్లిమెంటరీ ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ ఫైల్‌‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

నేడు సిట్ ముందుకు ముగ్గురు 

వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్‌‌ 41(ఏ) సీఆర్‌‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న బంజారాహిల్స్‌‌లోని కమాండ్ కంట్రోల్‌‌ సెంటర్‌‌లో‌‌ విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్‌‌తో కలిసి దిగిన ఫొటోలు, కాల్‌‌డాటా ఆధారంగా సిట్‌‌ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే బీఎల్‌‌ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, లాయర్‌‌‌‌ శ్రీనివాస్‌‌, నందకుమార్ భార్య చిత్రలేఖ, అడ్వకేట్‌‌ ప్రతాప్‌‌గౌడ్‌‌లకు నోటీసులిచ్చింది. ఇప్పటికే ఈ నెల 21, 22న లాయర్‌‌‌‌ శ్రీనివాస్‌‌ను విచారించింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బ్యాంక్‌‌ స్టేట్‌‌మెంట్స్, ట్రావెలింగ్‌‌కి సంబంధించిన వివరాలతో రావాలని తెలిపింది. సిట్‌‌ ఆదేశాలతో నందకుమార్‌‌‌‌ భార్య చిత్రలేఖ, అడ్వకేట్‌‌ ప్రతాప్‌‌గౌడ్‌‌, లాయర్ శ్రీనివాస్‌‌ శుక్రవారం విచారణకు హాజరుకానున్నారు.