- నేడు మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని ఆదేశం
- ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్‌ను ప్రశ్నించిన సిట్
- ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి నియామకంలో సంతోష్‌రావు కీలకం!
- ఎస్‌ఐబీ, మాజీ సీఎం కేసీఆర్ మధ్య సమాచారం చేరవేసినట్లు ఆధారాలు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ను విచారించిన సిట్.. తాజాగా బీఆర్‌ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావుకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి ఆదేశించారు.
2024, మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద వివరాలు అందించాలని సూచించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అధికారులు, సాక్షులు, రాజకీయ నాయకుల్ని ప్రశ్నించిన సిట్ అధికారులు గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ నాయకులను విచారణకు పిలుస్తుండడం గమనార్హం. కాగా, మిగిలినవారిని షెడ్యూల్‌ప్రకారం ఉదయం 11 గంటలకు పిలిచిన సిట్అధికారులు, సంతోష్‌ను మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు పిలవడం ఆసక్తిరేపుతున్నది.
ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి నియామకం వెనుక..
ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకంతో పాటు ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావు సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారితో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్‌ను నింపేయడంలో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది.
గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్‌కు, ఎస్‌ఐబీ పోలీసులకు మధ్య సమాచారం చేరవేయడం, ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేయించడం, ఆర్థిక వ్యవహారాల మానిటరింగ్ చేయడంలో సంతోష్‌రావు ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. ఈ కేసులో నిందితుల స్టేట్‌మెంట్లు సహా బీ కేటీఆర్ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా సంతోష్‌రావును ప్రశ్నించనున్నట్లు తెలిసింది.
