ఫాంహౌస్ కేసు : 8 గంటల పాటు నందు భార్యను విచారించిన సిట్​

ఫాంహౌస్ కేసు : 8 గంటల పాటు నందు భార్యను విచారించిన సిట్​

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు కోరె నందు కుమార్  భార్య చిత్రలేఖ, అడ్వకేట్​ప్రతాప్ ల సిట్ విచారణ ముగిసింది. వారిద్దరిని సిట్ అధికారులు​దాదాపు 8 గంటల పాటు విచారించారు. విచారణ ముగియగానే  నందు భార్య చిత్రలేఖ సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. విచారణలో భాగంగా వారి నుంచి  ఎమ్మెల్యే ల కొనుగోలు కేసుకు సంబంధించిన  పలు వివరాలను అధికారులు సేకరించారు.

స్వామీజీ తో దిగిన ఫొటోలు, కాల్ డేటా ఆధారంగానూ పలు ప్రశ్నలను సిట్​ అధికారులు సంధించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని మరో ఇద్దరు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజులతో నందుకి ఉన్న సంబంధం గురించి కూడా నందు భార్యపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఇప్పటికే ఇదే కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్  సహా కేరళ ఎన్డీయే కన్వీనర్ తుషార్, డాక్టర్  జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ పై సిట్ మొయినాబాద్ పీఎస్ లో కేసులు నమోదు చేసింది.హైకోర్టు ఆదేశాలతో బీఎల్ సంతోష్ కు మరోసారి 41ఏ సీఆర్పీసీ కింద సిట్ నోటీసులిచ్చింది. ఈనెల 26 లేదంటే 28న విచారణకు హాజరవ్వాలని కోరింది. అయితే దీనిపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను నిందితుడిగా పేర్కొని నోటీసులు ఇవ్వడం సరికాదని వాదనలు వినిపించారు. తనపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తోందని, సంబంధం లేని వ్యవహారంలో తన పేరును ప్రచారం చేస్తున్నారని బీఎల్ సంతోష్ తన పిటిషన్ లో ఆరోపించారు. సీఆర్పీసీ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఇవాళ తెలంగాణ హైకోర్టులో బీఎల్ సంతోష్ కు ఊరట లభించింది. సిట్ జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసుల అమలుపై డిసెంబర్ 5 వరకు న్యాయస్థానం స్టే విధించింది. కాగా, ఈనెల 29వ తేదీన విచారణకు రావాలంటూ ఏపీ ఎంపీ రఘురామ రాజు సిట్ నోటీసులు జారీ చేసింది.