డీఏఓ పేపర్ ఎవరికైనా అమ్మారా? .. మరో ముగ్గురు అనుమానితులను ప్రశ్నించిన సిట్

డీఏఓ పేపర్ ఎవరికైనా అమ్మారా? .. మరో ముగ్గురు అనుమానితులను ప్రశ్నించిన సిట్
  • డీఏఓ పేపర్ ఎవరికైనా అమ్మారా?
  • మరో ముగ్గురు అనుమానితులను ప్రశ్నించిన సిట్
  • న్యూజిలాండ్​లో ప్రశాంత్​ రెడ్డి కోసం లుకౌట్ నోటీసులు

హైదరాబాద్/ఖమ్మం, వెలుగు: టీఎస్‌‌ పీఎస్సీ పేపర్  లీకేజీ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గ్రూప్‌‌ 1, ఏఈ, డీఏఓ పేపర్ల లీకేజీలో ఇప్పటికే 17 మందిని సిట్‌‌  అరెస్టు చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌‌లో ప్రశాంత్‌‌ రెడ్డి కోసం సిట్  అధికారులు లుకౌట్‌‌  నోటీసులు జారీ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో శనివారం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ముగ్గురూ ఏఈ, డీఏఓ పరీక్ష రాసినట్లు అనుమానిస్తున్నారు. పేపర్ లీకేజీతో సంబంధాలు ఉంటే వారిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అపుడు నిందితుల సంఖ్య 20కి చేరుతుంది. ఈ క్రమంలోనే గ్రూప్‌‌ 1లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిలో అనుమానితులను మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే ప్రశ్నించిన వారిలో అనుమానాస్పదంగా వ్యవహరించిన వారిని సాంకేతిక ఆధారాలతో గుర్తించినట్లు తెలిసింది.

ఖమ్మంలో సుస్మిత, లౌకిక్‌‌ పై విచారణ

డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్  కొనుగోలు చేసిన సుస్మిత, ఆమె భర్త సాయి లౌకిక్‌‌ను సిట్‌‌  అధికారులు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో వారిని శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం రెండో రోజు విచారణలో భాగంగా నిందితులను వారి సొంతూరు ఖమ్మంకు తీసుకెళ్లి, వారి ఇంట్లో ప్రశ్నించారు. అలాగే వారి ఇంట్లో తనిఖీలు చేశారు. కుటుంబ సభ్యుల స్టేట్‌‌మెంట్‌‌ ను రికార్డు చేశారు. లౌకిక్‌‌  కార్ల వ్యాపారం గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. డీఏఓ మాస్టర్  క్వశ్చన్ పేపర్  కొనుగోలు చేసిన తరువాత ఎవరికైనా చెప్పారా లేదా రీసేల్ చేశారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం నిందితులను అధికారులు హైదరాబాద్  తీసుకెళ్లారు. ఆ ఇద్దరి కస్టడీ ఆదివారంతో ముగియనుంది. దీంతో చంచల్‌‌గూడ జైలులో వారిని రిమాండ్‌‌కు తరలించనున్నారు.