మనసును తాకేలా ‘సీతారామం’

మనసును తాకేలా  ‘సీతారామం’

నటీనటులు : దుల్కర్ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్, రష్మిక మందాన్న, సుమంత్, భూమిక, గౌతమ్ మీనన్,  తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, సచిన్ ఖేడ్కర్ తదితరులు.
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రాఫర్ : పీఎస్ వినోద్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సమర్పణ : వైజయంతీ మూవీస్
నిర్మాతలు : అశ్వినీదత్, స్వప్నాదత్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : హను రాఘవపూడి

లవ్‌స్టోరీలు మానేద్దాం అనుకుంటూనే కథ విని ఎక్సయిటయ్యి ‘సీతారామం’లో నటించానన్నాడు దుల్కర్ సల్మాన్. ఆ ఒక్క మాటతో ఈ సినిమాపై ఏర్పడిన ఆసక్తి అంతా ఇంతా కాదు. మంచి పర్‌‌ఫార్మర్‌‌గా అతనిపై తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఇంప్రెషన్.. రష్మిక కీలక పాత్రలో నటించడం.. వైజయంతీ మూవీస్ నిర్మించడం లాంటి అంశాలు అందరి దృష్టినీ ఈ సినిమా వైపు తప్పాయి. మరి వాళ్లందరినీ మూవీ మెప్పించిందా? సీతారాముల ప్రేమకథ ఫలించిందా? పరిశీలిద్దాం. 


 
కథ : 
లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) దేశం కోసం ప్రాణమిచ్చేంత నిజాయతీపరుడు. మానవత్వం ఉన్నవాడు. అతను చేసిన ఓ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆల్ ఇండియా రేడియోవాళ్లు ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు తాను అనాథనని, తనకంటూ ఎవరూ లేరని చెబుతాడు. దాంతో చలించిపోయిన రేడియో జాకీ.. ‘దేశం కోసం రామ్ ఉన్నాడు, రామ్ కోసం తల్లిగా నేనొక ఉత్తరం రాస్తాను’ అని చెబుతుంది. ఇక అక్కడి నుంచి తల్లిగా, చెల్లిగా, అన్నగా, తమ్ముడిగా ఎంతోమంది అతనికి ఉత్తరాలు రాస్తుంటారు. అయితే సీతామాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) అతనికి భార్యగా ఉత్తరాలు రాయడం మొదలుపెడుతుంది. దాంతో రామ్ మనసులో కొత్త ఫీలింగ్స్ మొదలవుతాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఫ్రమ్ అడ్రస్‌ కూడా లేకపోవడంతో ఎలాగైనా తనని కనిపెట్టి, తనతోనే జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటాడు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా, సీతని కనిపెట్టాడా, ఇద్దరూ ఒకటయ్యారా అనేది మిగతా కథ.

విశ్లేషణ..
‘సీతారామం’ కథంతా రెండు కాలాల్లో నడుస్తుంది. 1965లో సాగే రామ్, సీతల అందమైన ప్రేమకథతో పాటు 1985లో పాకిస్థానీ యువతి ఆఫ్రీన్‌ (రష్మిక) జర్నీ కూడా నడుస్తుంటుంది. సినిమా ప్రారంభంలోనే పాత్రల్ని పరిచయం చేయడానికి కాస్త టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. అసలు కథలోకి వెళ్లడానికి టైమ్ పట్టడంతో కథనం స్లోగా నడుస్తుంది. కానీ సీతారాముల ప్రేమ ప్రయాణం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఆ కథను ఫీలవడం మొదలుపెడతారు ప్రేక్షకులు. సీతను రాముడు ఇష్టపడటం.. ఆమె కోసం వెతకడం.. ఇద్దరూ దగ్గరవడం.. ప్రాణంగా ప్రేమించుకోవడం.. ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులు.. అన్నింటినీ చాలా అందంగా నేరేట్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర వచ్చే టర్న్‌ సెకెండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఆ ఆసక్తిని తగ్గిపోనివ్వకుండా ద్వితీయార్థాన్ని డీల్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ స్పీడుగా పరుగెత్తడంతో మూవీ మరింత ప్రెస్ చేస్తుంది.  

యుద్ధం, ప్రేమ ఈ రెండు అంశాల్నీ బ్యాలెన్స్ చేస్తూ, యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ అనే ట్యాగ్ లైన్‌కి న్యాయం చేశాడు దర్శకుడు. సినిమా ఎత్తుగడని కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నాడనే చెప్పాలి. పాకిస్థాన్‌లో ఓ ఉత్తరం. అది కూడా ఇరవయ్యేళ్ల క్రితం రాసింది. లెఫ్టినెంట్ రామ్ రాసిన ఆ ఉత్తరాన్ని సీతామాలక్ష్మికి చేర్చమని తన మనవరాలు ఆఫ్రీన్‌కి తాతయ్య (సచిన్ ఖేడ్కర్‌‌) చెప్తాడు. అది ఆమెకి ఇష్టం ఉండదు. కానీ అలా చేయకపోతే ఆయన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తనకి రాదు కాబట్టి వెతుకులాట మొదలెడుతుంది. ఎవరెవరినో కలుస్తుంది. అసలు విషయాలు కనిపెడుతుంది. కథ మొత్తం ఆఫ్రీన్ యాంగిల్‌లో నడిపించడమనేదే ఈ కథని సరికొత్తగా నిలెబట్టిందని చెప్పొచ్చు. ఆ ఉత్తరం అసలు పాకిస్థాన్‌ ఎందుకు వెళ్లింది అనే ప్రశ్నకి జవాబు చెప్పుకోవాలనే క్యూరియాసిటీ ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెడుతుంది. అలాగని ఓపిక తెచ్చుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆసక్తికరమైన సన్నివేశాలు.. చక్కని పాటలు.. అందమైన లొకేషన్లు.. మెప్పించే మలుపులు.. ఇలా బోలెడన్ని ఉన్నాయి కదలకుండా కూర్చోబెట్టడానికి!

ఎవరెలా చేశారంటే..
దుల్కర్‌‌లోని మంచి నటుడు మరోసారి ఈ సినిమాతో బైటికొచ్చాడు. రామ్ పాత్రకి అతను పర్‌‌ఫెక్ట్. కూల్‌గా కనిపిస్తూ.. సాఫ్ట్ గా మాట్లాడుతూ.. కళ్లతోనే హావభావాలు ప్రకటిస్తూ ప్రతి ఫ్రేమ్‌లో మెప్పించాడు. సీత పాత్రలో మృణాల్ ఒదిగిపోయింది. స్క్రీన్‌ మీద చాలా అందంగా కూడా కనిపించింది. నిజానికి ఆమె చేసిన హిందీ సినిమాలన్నింటిలో కంటే ఇందులోనే బాగా కనిపించిందని చెప్పొచ్చు. ఇక రష్మిక పాత్ర ఈ సినిమాకి ప్రాణం. దానికి పూర్తి న్యాయం చేసిందామె. గెటప్ దగ్గర్నుంచి పర్‌‌ఫార్మెన్స్ వరకు ఆమె మంచి చాయిస్ అని ప్రూవ్ చేశాయి. సుమంత్‌కి ఓ డిఫరెంట్ రోల్ దొరికింది. దాన్ని బాగా పండించాడు కూడా. అయితే వెన్నెల కిశోర్, సునీల్‌ల పాత్రలు అంతగా పండలేదు. భూమిక పాత్ర నిడివి చాలా తక్కువ. ఆ క్యారెక్టర్‌‌కి ఎవరైనా సరిపోతారు. అందుకే అంత ఇమేజ్ ఉన్న నటిని ఎందుకు తీసుకున్నారు అనిపిస్తుంది చూసేవారికి. అయితే ఆమె చేయడం వల్ల ఆ పాత్ర కూడా గుర్తుండిపోతుంది.

టెక్నికల్‌ గా ఎలావుందంటే..
ఇక టెక్నికల్‌ అంశాల సంగతి. ఈ సినిమాకి తన మ్యూజిక్‌తో చాలా మంచి ఫీల్ తీసుకొచ్చాడు విశాల్ చంద్రశేఖర్. పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌‌ అన్నీ చాలా ప్లెజెంట్‌గా ఉంటాయి. అలాగే సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అవి నిజమైన లొకేషన్లా లేక ఏవైనా గ్రాఫిక్స్ చేశారా అన్నంత అద్భుతంగా విజువలైజ్ చేశారు. ఎనభైల కాలానికి ప్రేక్షకుల్ని తీసుకెళ్లడంలోనూ సక్సెస్ అయ్యారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్లు మాట్లాడుతుంటే ఏదో కవిత్వం వింటున్నట్టే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లోనూ మాటలు సింపుల్‌గా ఉన్నా సూటిగా మనసుని తాకేలా రాశారు. ఇక దర్శకుడు హను పనితనానికి ఇంప్రెస్ అవ్వాల్సిందే. సింపుల్‌గా సినిమాని స్టార్ట్ చేసి.. ఎమోషనల్ క్లైమాక్స్తో మనసుని భారం చేసి పంపిస్తాడు. మధ్యలో అక్కడక్కడా ఫ్లాట్ నేరేషన్‌ ఉన్నా.. పాత్రల ప్రెజెంటేషన్ వల్ల పెద్దగా వెలితి అనిపించదు. ముఖ్యంగా ఎంతో లోతైన ప్రేమకథని ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలూ లేకుండా క్లీన్‌గా ప్రెజెంట్ చేసిందుకు మెచ్చుకుని తీరాల్సిందే. సెకెండాఫ్‌లో తడబడతాడని హనుకి పేరుంది. కానీ ఆ లోపాన్ని ఈ సినిమాలో అధిగమించాడని ఒప్పుకోవచ్చు.
కొసమెరుపు: సీతారామం.. ప్రేమలో మునగాల్సిందే!