"సీతారామం" ట్రైలర్..: ప్రేమ లేఖ ప్రయాణం

"సీతారామం" ట్రైలర్..: ప్రేమ లేఖ ప్రయాణం

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం సీతారామం. అందాల రాక్షసి, పడి పడి లేచె మనసు వంటి సున్నితమైన లవ్ స్టోరీలను అందించిన హను రాఘవపూడి ఈ మూవీకి  దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ సీతారామం చిత్రాన్ని సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాత్రల పరిచయం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. తాజాగా సీతారామం చిత్ర బృందం ట్రైలర్ను రిలీజ్ చేసింది. 

20 ఏళ్ల క్రితం లెఫ్ట్‌నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మీకి నువ్వే చేర్చాలి అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.  ఆ ఉత్తరంతో అఫ్రిన్ (రష్మిక ) ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ప‌ది రోజుల్లో సీత‌ని వెతికి ప‌ట్టుకుని ఆలేఖ ఆమెకు ఇవ్వాలనేది అఫ్రిన్ టార్గెట్. ఇంతలో సీతామ‌హాల‌క్ష్మి అనే పేరుతో.. భూత భ‌విష్యత్ వ‌ర్తమాన కాలాల్లో ఎవ్వరూ లేరంటూ మురళీ శర్మ  తన ప్రయాణానికి అడ్డుక‌ట్ట వేసే ప్రయత్నం చేస్తాడు  అయినా స‌రే రష్మిక సీతాన్వేషణ కొనసాగిస్తుంది. కాశ్మీర్ కొండల్లోని  ఒంటరి సైనికుడికి.. ఓ యువతికి మధ్య నడిచే 1965 నాటి ప్రేమ కథే సీతారామం. నాలుగు మాట‌లు పోగేసి లేఖ రాస్తే.. కాశ్మీర్‌ని మంచుకొదిలేసి వ‌స్తారా? అనే  సీత అంద‌మైన మాట‌లు ఆకర్షిస్తాయి.  సీతను వెతికే క్రమంలో రామ్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. మొత్తంగా సీతారామం.. ఈ ఇద్దరి అపరిచితుల మధ్య ఉత్తరాలతో ఏర్పడే ప్రేమ కథ. ఈ కథ ఎటువైపు వెళ్లింది. రష్మిక ఆ ఉత్తరాన్ని సీతకు అందజేసిందా అనేది సస్పెన్స్. దాదాపు రెండున్నర నిమిషాలున్న ట్రైలర్ ను చూస్తుంటే సీతారామం సినిమా ఓ అందమైన దృశ్య కావ్యంగా నిలవనుందని తెలుస్తోంది. 

సీతారామంలో ప్రకాశ్ రాజ్, తరుణ్ భాస్కర్, సుమంత్, భూమిక లాంటి సీనియర్ నటులు నటించారు. ఈ చిత్రానికి విశాల్ శేఖ‌ర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు పలు భాషల్లో సీతారామం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.