
బీజేపీ అధికారంలోకి వచ్చాక సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వాళ్లకు పట్టాలు ఇస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడుతామని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించారు.ఈసందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మోడీ సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకుపోవడమే తమ లక్ష్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటలు మర్చిపోయి.. కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే పడి ఉంటున్నారని మండిపడ్డారు. పట్టాలు ఇప్పిస్తాం, డ్రైనేజీ మంజూరు చేయిస్తామని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలాయన్నారు. శ్రీరాంపూర్, మందమర్రి పరిధిలో సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వాళ్లందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ పాల్గొన్నారు.