- మంత్రి కేటీఆర్ హామీతో జోష్
- నియోజకవర్గాల్లో ఎక్కువ టైమ్‌స్పెండ్ చేసేలా ప్రణాళిక
- ప్రచారానికి ప్లాన్చేసుకుంటున్న ఎమ్మెల్యేలు
నిజామాబాద్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తామే పోటీ చేయబోతున్నామని సిట్టింగ్‌ఎమ్మెల్యేలు ధీమాకు వచ్చారు. సర్వే రిపోర్టుల ఆధారంగా కొందరిని మారుస్తారని హైదరాబాద్ స్థాయిలో జరిగిన ప్రచారంతో జిల్లాలోని ఇద్దరు సిట్టింగ్‌ఎమ్మెల్యేలు మొన్నటిదాకా టెన్షన్ పడ్డారు. మూడు రోజుల కింద నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ చేసిన కామెంట్‌తో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ కష్టపడి పనిచేస్తున్నారు, వారిని కడుపులో పెట్టుకొని.. కడుపునిండా అన్నం పెట్టి మరోసారి పంపాలి’ అని కేటీఆర్ కామెంట్చేస్తూ .. సూచనప్రాయంగా సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లంటూ వెల్లడించారు. దీంతో బీఆర్ఎస్లో పొలిటికల్ హీట్ షురువైంది.
హ్యాట్రిక్‌పై గురి..
2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అయిదు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికోసం కార్యకర్తలను కలుపుకొని ప్రజలతో ఎక్కువ టైమ్ గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అర్బన్ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ప్రతీరోజు నగరంలోని ఏదో ఓ డివిజన్లో పర్యటిస్తూ, ప్రజలతో టచ్‌లో ఉంటున్నారు. వార్డుల్లో జనం అవసరాలను గుర్తించే టీమ్‌లను దింపారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రతినిధులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన లోపాలను వారి ద్వారా తెలుసుకొని నోట్ చేసుకుంటున్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున ఆయన కొడుకు జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ యాక్టివ్‌గా ఉన్నారు.
నియోజకవర్గంలోని ప్రజల అవసరాలు తెలుసుకొని రికార్డు తయారు చేస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గంలోని ప్రతీ విలేజ్‌ను టచ్ చేసేలా నమస్తే నవనాథపురం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలెవరైనా సమస్యలు విన్నవిస్తే, పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను పురమాయిస్తున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్యాడర్‌ను సన్నద్ధులను చేసి గెలుపు వ్యూహాన్ని రూపొందిస్తున్నారు.
సర్వేలపై భయం భయంగా..
ఎన్నికల కోసం స్టేట్ లెవల్లో చేయించిన సర్వే రిపోర్ట్‌ల ప్రామాణికంగా రాష్ట్రస్థాయిలో కొందరు సిట్టింగ్‌లను మారుస్తారని హైకమాండ్ ఇండికేషన్ ఇచ్చింది. దీంతో సర్వే రిపోర్ట్ఎవరికి అనుకూలంగా వస్తుంది? ఈ సారి టికెట్ వస్తుందా? జిల్లాల్లో ఎవరు మారుతారనే విషయంపై ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. పొలిటికల్ సర్కిల్స్‌లో జరిగిన డిస్కషన్ కొందరిని టెన్షన్ పెట్టింది.
మంత్రి కేటీఆర్ నిజామాబాద్ సభను బలప్రదర్శన కోసం ఉపయోగించుకోవాలని తమకు జిందాబాద్‌లు కొట్టే వారిని ఎమ్మెల్యేలు సభకు తరలించారు. ముచ్చట అర్థమైందని స్పీచ్ స్టార్ట్ చేసిన కేటీఆర్ జిల్లాలోని అయిదుగురు ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించాలని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు.