1962 నాటి హిస్టరీని ఆర్మీ రిపీట్ చేయబోదు

1962 నాటి హిస్టరీని ఆర్మీ రిపీట్ చేయబోదు

శివసేన మౌత్‌పీస్ సామ్నా
ముంబై: లడఖ్‌లో ప్రస్తుత పరిస్థితులు చైనాతో 1962 వార్ నాటి తీవ్రస్థితిని గుర్తు చేస్తున్నాయని శివ సేన పార్టీ అభిప్రాయపడింది. పార్టీ మౌత్‌పీస్ అయిన సామ్నా పత్రిక తన ఎడిటోరియల్‌లో లడఖ్‌లో ఇండో–చైనా మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనపై రాసుకొచ్చింది. గురువారం విదేశాంగ శాఖ మంత్రి లడఖ్‌ ప్రతిష్ఠంభనపై మాట్లాడారు. 1962 తర్వాత ఇది అత్యంత తీవ్రస్థితి అన్నారు. ఈ విషయాలను సామ్నా తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. సరిహద్దుల్లో ఇరు వైపులా రెండు దేశాల దళాలు మోహరించి ఉన్నాయని చెప్పింది. చైనా చర్యలు, ఉద్దేశం అస్సలు మారలేదని స్పష్టం చేసింది.

‘చైనా డ్రాగన్ దుందుడుకు చర్యలను ఆపడం లేదు. అలాగే వారి ఉద్దేశం కూడా మారడం లేదు. ఇండో–చైనా ఆర్మీ చర్చలు జరుపుతున్నాయి. కానీ ఇరు దేశాలు లడఖ్‌ బార్డర్‌‌లో మోహరించి ఉన్నాయి. లడఖ్‌ నుంచి చైనా తన దళాలను ఉపసంహరించుకోవాలని ఇండియా అంటోంది. ఫింగర్ ఫోర్ నుంచి తొలుత ఇండియా వెనక్కి తగ్గాలని చైనా చెబుతోంది. ఇది భారత్‌కు ససేమిరా ఇష్టం లేదు. ఇప్పటి ఇండియా 1962 నాటి భారత్‌ కాదు. అప్పటి కంటే ఇప్పుడు ఇండియా చాలా శక్తిమంతమైనది. ఇది తెలిసి కూడా భూభాగాన్ని ఆక్రమించడానికి యత్నించడం, చొచ్చుకురావడం లాంటి దుందుడుకు చర్యలను చైనా ఆపడం లేదు. 1962 నాటి హిస్టరీని ఇండియన్ ఆర్మీ రిపీట్ చేయబోదు’ అని సామ్నా వివరించింది.