3.49 లక్షల కోట్లు...! ఇన్వెస్టర్లు నష్టపోయిన మొత్తం ఇది

3.49 లక్షల కోట్లు...! ఇన్వెస్టర్లు నష్టపోయిన మొత్తం ఇది
  • సెన్సెక్స్​ 705 పాయింట్లు డౌన్​
  • 211 పాయింట్లు తగ్గిన నిఫ్టీ

ముంబై: అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అదనంగా విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. గురువారం బీఎస్​ఈ సెన్సెక్స్ 706 పాయింట్లు పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 705.97 పాయింట్లు (0.87 శాతం) తగ్గి 80,080.57 వద్ద సెటిలయిది. ట్రేడింగ్​లో ఒక దశలో 773.52 పాయింట్లు పడి 80,013.02 వద్ద కనిష్టాన్ని తాకింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 211.15 పాయింట్లు (0.85 శాతం) నష్టపోయి 24,500.90 వద్ద ముగిసింది. 

దీంతో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 3.49 లక్షల కోట్లు కోల్పోయారు. బీఎస్​ఈలో లిస్ట్​ అయిన మొత్తం కంపెనీల మార్కెట్​ విలువ రూ. 3,49,156.44 కోట్లు తగ్గింది. ట్రేడింగ్​ ముగిసే సమయానికి బీఎస్​ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్​ విలువ రూ. 4,37,89,765.17 కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్​లోని సంస్థల్లో హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్, పవర్​ గ్రిడ్​, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హిందుస్థాన్​ యునిలివర్, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు భారీగా నష్టపోయాయి.  

టైటాన్​, లార్సెన్​ అండ్​ టూబ్రో, మారుతి, యాక్సిస్​ బ్యాంక్​ లాభాల్లో ముగిశాయి. జియోజిత్​ ఇన్వెస్ట్​మెంట్స్​ లిమిటెడ్​ హెడ్ ఆఫ్​ రీసెర్చ్​ వినోద్​ నాయర్​ మాట్లాడుతూ, భారత వస్తువులపై సుంకాల అమలు నేపథ్యంలో దేశీయ ఈక్విటీలు నష్టాల్లో ముగిశాయని తెలిపారు. సుంకాల ప్రభావాలను తగ్గించడానికి కాటన్​ దిగుమతి సుంకం మినహాయింపు ఆశలు రేకెత్తించినా, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనంగానే ఉందన్నారు.

రొయ్యలు, తోలు, రత్నాలు, ఆభరణాల రంగాలపై తీవ్ర ప్రభావం

 సుంకాల వల్ల భారత దుస్తుల పరిశ్రమ, రొయ్యలు, తోలు, రత్నాలు, ఆభరణాల  రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. బీఎస్ఈలో కైటెక్స్​ గార్మెంట్స్, పెర్ల్​ గ్లోబల్​ ఇండస్ట్రీస్​, సియారామ్​ సిల్క్​ మిల్స్​, రేమండ్​  లైఫ్​స్టైల్​, అలోక్ ​ ఇండస్ట్రీస్​, రూపా అండ్​ కంపెనీ, వెల్​స్పన్​ లివింగ్​, ట్రైడెంట్​ లిమిటెడ్​ షేర్లు నష్టపోయాయి. రొయ్యల ఎగుమతి సంస్థలైన అపెక్స్​ ఫ్రోజెన్​ ఫుడ్స్​, వాటర్​బేస్​ లిమిటెడ్, అవంతి ఫీడ్స్​ షేర్లు కూడా పతనమయ్యాయి. మోతీలాల్​ ఓస్వాల్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ లిమిటెడ్​లో వెల్త్​ మేనేజ్​మెంట్​ రీసెర్చ్​ హెడ్​ సిద్ధార్థ్​ ఖేమ్కా మాట్లాడుతూ, అమెరికా మార్కెట్​పై అధికంగా ఆధారపడిన వస్త్ర, దుస్తుల, రత్న, ఆభరణాల, రొయ్యలు, తోలు, ఫుట్​వేర్​ రంగాలు 50 శాతం సుంకాల వల్ల తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పారు. 

తోలు, పాదరక్షల స్టాక్స్​లో ఖాదిమ్​ ఇండియా, రిలాక్సో ఫుట్​వేర్స్​, మయూర్​ యునిక్యూటర్స్​, సూపర్​హౌస్​ లిమిటెడ్​, మీర్జా ఇంటర్నేషనల్​ నష్టాలు చవిచూశాయి. రత్నాలు, ఆభరణాల స్టాక్స్​లో బ్లూస్టోన్​ జ్యువెలరీ అండ్​ లైఫ్​స్టైల్​, స్కై గోల్డ్​ అండ్​ డైమండ్స్​, శాంతి గోల్డ్​ ఇంటర్నేషనల్​, త్రిభువన్​దాస్​ భీమ్​జీ ఝవేరి, రాజేష్​ ఎక్స్​పోర్ట్స్​ షేర్లు పడిపోయాయి. బీఎస్​ఈ మిడ్​క్యాప్​ 1.09 శాతం, స్మాల్​క్యాప్​ ఇండెక్స్​ 0.96 శాతం పడిపోయాయి. సర్వీసెస్​ 2.27 శాతం, టెలికం 1.73 శాతం, ఐటీ 1.68 శాతం, రియల్టీ 1.47 శాతం, యుటిలిటీస్​ 1.26 శాతం పడిపోయాయి. ఎఫ్​ఐఐలు రూ. 6,516.49 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, డీఐఐలు మాత్రం రూ. 7,060.37 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.