అమెరికా ఎన్నికల్లో మనోళ్ల సత్తా.. ఆరుగురు ఇండో అమెరికన్ల గెలుపు

అమెరికా ఎన్నికల్లో మనోళ్ల సత్తా.. ఆరుగురు ఇండో అమెరికన్ల గెలుపు
  • తొలిసారి విజయంసాధించిన సుహాస్ సుబ్రమణ్యం
  • వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండియన్​గా రికార్డు
  • చట్టసభలో ఆరుకు పెరిగిన ప్రాతినిథ్యం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మనోళ్లు సత్తా చాటారు. ఆరుగురు ఇండో అమెరికన్​లు సెనేటర్లుగా ఎన్నికయ్యారు. దీంతో ప్రతినిధుల సభలో ఇప్పటి వరకు ఐదుగురు ఉన్న మనోళ్లు.. ఈసారి ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. శ్రీ తానేదార్‌‌‌‌, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమిబెరా, ప్రమీలా జయపాల్‌‌‌‌ మరోసారి విజయం సాధించారు. వారితో పాటు న్యాయవాది అయిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా 10వ కాంగ్రెషనల్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ నుంచి డెమోక్రటిక్‌‌‌‌ పార్టీ తరఫున గెలుపొందారు. కాగా, అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 మంది ఇండో అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. ఆరుగురు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకున్నారు. 

రాజా కృష్ణమూర్తి (ఇల్లినాయిస్)

డెమోక్రాటిక్‌‌‌‌ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్‌‌‌‌ (8వ కాంగ్రెషనల్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌) నుంచి వరుసగా అయిదోసారి గెలుపొందారు. 2017 నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రిపబ్లికన్‌‌‌‌ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్‌‌‌‌ రిక్‌‌‌‌ను ఓడించారు. ఇక్కడి ఇండియన్ ఫ్యామిలీస్ కన్న కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

రో ఖన్నా (కాలిఫోర్నియా)

డెమొక్రాటిక్‌‌‌‌ పార్టీ తరఫున బరిలో దిగిన రో ఖన్నా.. కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి గెలుపొందాడు. 2017 నుంచి ఇక్కడి నుంచే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అక్కడి ఓటర్లు రో ఖన్నాను సెనేటర్​గా ఎన్నుకున్నారు. రిపబ్లికన్‌‌‌‌ అభ్యర్థి అనితా చెన్‌‌‌‌ను ఓడించి విజయం సాధించారు. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ, ఇమ్మిగ్రేషన్ పరమైన సమస్యలపై అడ్వొకేట్ హోదాలో ఖన్నా సేవలందిస్తున్నారు.

సుహాస్ సుబ్రమణ్యం (వర్జీనియా)

డెమొక్రాటిక్‌‌‌‌ అభ్యర్థిగా వర్జీనియా (10వ కాంగ్రెషనల్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌) నుంచి బరిలో దిగిన సుహాస్‌‌‌‌ సుబ్రమణ్యం.. రిపబ్లికన్‌‌‌‌ పార్టీకి చెందిన మైక్‌‌‌‌ క్లాన్సీని ఓడించి విజయం సాధించారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌‌‌‌గా వ్యవహరిస్తున్న ఆయన... డెమొక్రాట్లకు కంచుకోట రాష్ట్రంగా పేరున్న వర్జీనియా నుంచి గెలిచారు. దీంతో వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండో అమెరికన్‌‌‌‌గా సుబ్రమణ్యం రికార్డు సృష్టించారు. గతంలో అధ్యక్షుడు ఒబామాకు వైట్‌‌‌‌ హౌస్‌‌‌‌ సలహాదారుగా కూడా సుహాస్‌‌‌‌ సేవలందించారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ఓటర్లకు సుహాస్ ధన్యవాదాలు తెలిపారు

శ్రీ థానేదార్ (మిచిగాన్)

మిచిగాన్‌‌‌‌ (13వ కాంగ్రెషనల్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌) నుంచి బరిలోకి దిగిన శ్రీ థానేదార్‌‌‌‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌‌‌‌ను 35 శాతం ఓట్ల తేడాతో ఓడించారు. వరుసగా రెండోసారి గెలుపును దక్కించుకున్నారు. ఈయన 2023 నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

అమిబెరా (కాలిఫోర్నియా)

సీనియర్‌‌‌‌ ఇండో అమెరికన్‌‌‌‌ సెనేటర్ అయిన అమిబెరా ఈసారి కూడా కాలిఫోర్నియా (6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి విజయం సాధించారు. వృత్తి పరంగా ఈయన ఓ డాక్టర్. 2013 నుంచి వరుసగా ఆరు సార్లు గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఏడోసారి బరిలోకి దిగిన అమిబెరా.. రిపబ్లికన్‌‌‌‌ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. 

ప్రమీలా జైపాల్ (వాషింగ్టన్)

డెమోక్రటిక్‌‌‌‌ నేత ప్రమీలా జైపాల్.. వాషింగ్టన్ (7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌‌‌‌) నుంచి గెలిచారు. ఈమె 2017 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డాన్ అలెగ్జాండర్‌‌‌‌ను ఓడించి తిరిగి ఎన్నికయ్యారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, వలసదారుల హక్కులపై పోరాడారు. 59 ఏండ్ల ప్రమీల జైపాల్.. డెమోక్రటిక్‌‌‌‌ పార్టీలో శక్తిమంతమైన నేతగా ఇప్పటికే ఎదిగారు.