
నార్కట్పల్లి, వెలుగు: నార్కట్ పల్లి–-అద్దంకి హైవేపై లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల తెలిపిన ప్రకారం.. ఏపీలోని కందుకూరి నుంచి ఆదివారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ కు వస్తుంది. మార్గమధ్యలో నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం ఫ్లైఓవర్ పైకి రాగానే ముందు వెళ్తున్న రెడ్ మిక్స్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ వెనకాల నుంచి ఢీ కొట్టింది.
దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయి బస్సు డ్రైవర్ రెండు కాళ్లు విరిగి పోయి క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు స్థానికులతో కలిసి రెండు గంటల శ్రమించి బయటకు తీశారు. వెంటనే స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు. బస్సులోని ఆరుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయపడగా చికిత్స నిమితం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్రేన్ల సాయంతో ఢీకొన్న వాహనాలను పక్కకు తొలగించి క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు.