చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభమెప్పుడో ?..పనులు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు

చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రి  ప్రారంభమెప్పుడో ?..పనులు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
  • అరకొర వసతుల మధ్య రోగులకు వైద్య సేవలు

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రారంభించడం లేదు. మూడేండ్ల కింద రూ. 8.70 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం పనులు ప్రారంభించి ఆరు నెలల కింద  పూర్తి చేశారు. కానీ ఇంకా పాత భవనంలోనే అరకొర వసతుల మధ్య రోగులకు సేవలందిస్తున్నారు. 

ఆస్పత్రి ప్రారంభంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించగా నాయకులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు కానీ ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోవడంతో చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. 

సబ్ డివిజన్ లో మెరుగైన వైద్య సేవలు

చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభమైతే సబ్ డివిజన్ పరిధిలోని చేర్యాల, మద్దూరు, ధూల్మిట్ట, కొమురవెల్లి మండలాల ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు జనగామ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ ఆస్పత్రికి సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానికులు డిమాండ్​చేస్తున్నారు. 

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నూతనంగా నిర్మించిన చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ హైమావతి ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. పనుల గురించి ఆరా తీసి వారం రోజుల్లో ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్​కు ఆదేశాలు జారీ చేశారు. కానీ కొద్ది రోజులకే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రారంభానికి బ్రేక్ పడింది. 

ఆస్పత్రి ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నాం

చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభానికి అడ్డంకులు ఏర్పడినా ప్రస్తుతం కోడ్ ఆగిపోవడంతో మళ్లీ ఏర్పాట్లు ప్రారంభించాం. ఆస్పత్రి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అవసరమైన సాంకేతిక పరికరాలు సైతం వచ్చాయి. త్వరలోనే ప్రారంభోత్సవానికి రెడీ చేస్తాం. – దేవేందర్, ఆస్పత్రి సూపరింటెండెంట్