
వర్దన్నపేట, వెలుగు: కొడుకు చనిపోయాడనే బాధలోనూ తల్లిదండ్రులు మరో ఆరుగురికి ప్రాణదానం చేసేందుకు ముందుకు వచ్చారు. వరంగల్ జిల్లా వర్దన్నపేట శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవానీకుండ తండాకు చెందిన బానోత్ రమణ(22) తలకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని సికింద్రాబాద్ యశోద దవాఖానకు చిక్సిత కోసం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు.
కొడుకు లేకపోయినా, అతడి అవయవాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అవయవదానానికి ముందుకువచ్చారు. గుండె, కిడ్నీలు, లివర్‌ను దానం చేసి రమణ పేరెంట్స్ ఆదర్శంగా నిలిచారు. మృతుడికి నెలన్నర కింద పెండ్లి జరిగింది. అవయవ దానానికి అంగీకరించిన భార్య కల్యాణి, తల్లి విజయ, తండ్రి దేవేందర్‌ను తండావాసులు అభినందించారు.