ఒకరిని కాపాడబోయి ఆరుగురు మృతి

ఒకరిని కాపాడబోయి ఆరుగురు మృతి
  • పుట్టు వెంట్రుకలకు శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లిన బంధువులు 
  • పుట్టు వెంట్రుకలకు శ్రీరాంసాగర్‌‌ వెళ్లిన బంధువులు 
  • స్నానానికి గోదావరిలో దిగి కొట్టుకుపోయిన అబ్బాయి
  • కాపాడేందుకు నదిలోకి దిగిన ఆరుగురి మరణం
  • అబ్బాయిని మాత్రం  కాపాడిన స్థానికులు
  • నిజామాబాద్‌‌ జిల్లా డికంపల్లి, గుత్పల్లో విషాదం
  • సీఎం కేసీఆర్‌‌, ఎమ్మెల్సీ కవిత సంతాపం

వెలుగు నెట్‌‌వర్క్‌‌: అంతా దగ్గరి బంధువులు. గోదావరి నది దగ్గర పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్లారు. స్నానం కోసం కొందరు నదిలోకి దిగారు. ఓ అబ్బాయి కాస్త లోపలికి వెళ్లాడు. లోతు ఎక్కువుండటం, ప్రవాహమూ ఉండటంతో కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు మరో ఆరుగురు లోపలికెళ్లి మృతి చెందారు. తొలుత నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి ఓ కర్రను సాయంగా పట్టుకోవడంతో స్థానికులు అతన్ని కాపాడారు. చనిపోయిన వాళ్లంతా బంధువులే కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నింపింది.     

లోతు ఎక్కువుండటంతో..

నిజమాబాద్ జిల్లా మక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన సూర నరేశ్‌‌ తన కొడుకు పుట్టు వెంట్రుకలు తీయడానికి బంధువులతో కలిసి శుక్రవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్లారు. మాక్లూర్ మండలం డికంపల్లి గ్రామానికి చెందిన జీలకర్ర సురేశ్‌‌ (40), అతని కొడుకు యోగేశ్‌‌(16), నిజామాబాద్‌‌ ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్ (40), అతని కొడుకులు సిద్ధార్థ్(16), శ్రీకర్(14), గుత్ప గ్రామానికి చెందిన దొడ్ల రాజు (24), మరో వ్యక్తి రవికాంత్ (14) స్నానం చేయడానికి పుష్కర ఘాట్‌‌ దగ్గర నదిలోకి దిగారు. రవికాంత్ కొంచెం లోపలికి వెళ్లగా అక్కడ లోతు ఎక్కువుండటం, ప్రవాహం ఉండటంతో మునిగి కొట్టుకుపోయాడు. అది గమనించిన అతని తండ్రి పోశెట్టి ఒడ్డు నుంచి కేకలు వేశాడు. రవికాంత్‌‌ను కాపాడేందుకు ఈ ఆరుగురూ లోపలికి వెళ్లారు. రవికాంత్ నీటిలో కొట్టుకుపోతున్నప్పుడు తుంగ కర్రను పట్టుకోవడంతో స్థానికులు అతన్ని కాపాడారు. మిగిలిన ఆరుగురు ఒడ్డుకు దగ్గరలో ఉండటంతో బయటకు వస్తారనుకున్నారు. కానీ ఎంతకూ రాకపోవడంతో వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్‌‌ ఇచ్చారు. ఆ ఆరుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు. డెడ్‌‌ బాడీలను పోస్టుమార్టం కోసం బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అంతా బంధువులే

దొడ్ల రాజు ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మెన్‌‌గా పనిచేస్తున్నాడు. తల్లి చిన్న రాజు బాయి(73)తో కలిసి ఉంటున్నాడు. రాజుకు ఈమధ్యే ఎంగేజ్‌‌మెంట్ జరిగింది. పెండ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. చనిపోయిన బొబ్బిలి శ్రీనివాస్, జీలకర్ర సురేశ్‌‌లకు రాజు బావమరిది అవుతాడు. సిద్ధార్థ, శ్రీకర్, యోగేశ్‌‌ ముగ్గురూ రాజుకు మేనల్లుళ్లు. జీలకర్ర సురేశ్‌‌ తన ఊర్లో పేపర్‌‌ ప్లేట్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు భార్య వసంత, కొడుకు యోగేశ్‌‌తో పాటు కూతురు కల్కి ఉన్నారు. బొబ్బిలి శ్రీనివాస్ నిజామాబాద్‌‌లోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. ఈయకు భార్య వసుంధరతో పాటు సిద్ధార్థ్‌‌, శ్రీకర్‌‌ కొడుకులు.   

సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు జారిపడి ఆరుగురు మృతి చెందడంపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నదిలోకి దిగి దురదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నదిలో దిగి ఆరుగురు ప్రాణాలు కోల్పవడం దురదృష్టకరమని మంత్రి వేముల ప్రశాంత్​,  ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌‌గుప్తా, బాజిరెడ్డి గోరవ్ధన్‌‌, ఎమ్మెల్సీ కవిత, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌‌రావు అన్నారు.  

ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

పోచంపాడ్‌‌లో పుష్కరఘాట్ వద్ద ఎండోమెంట్‌‌వారు చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆర్మూర్ బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రమాద స్థలాన్ని శుక్రవారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌‌రెడ్డి, మురళీధర్, భూపేందర్ పరిశీలించారు.  నెల కింద ఇక్కడే ఓ వ్యక్తి పడి చనిపోయాడని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పినా స్పందించక పోవడం వల్లే మరో ప్రమాదం జరిగిందన్నారు.