డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ..వ్యూహం మార్చి చరిత్ర సృష్టించి

డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ..వ్యూహం మార్చి  చరిత్ర సృష్టించి

‘వర్క్‌‌హార్స్’.. మహ్మద్ సిరాజ్‌‌పై చాన్నాళ్ల నుంచి ఉన్న ముద్ర ఇది. నిరంతరం కష్టపడే వ్యక్తిత్వాన్ని చూపే ఈ పదం సిరాజ్ విషయంలో కొన్నిసార్లు విమర్శతో కూడిన పొగడ్తగా అనిపిస్తుంది. పేస్ లీడర్ బుమ్రాలా అతనికి వికెట్లు తీసే టాలెంట్‌‌ లేదన్న విమర్శలు ముందు నుంచీ ఉన్నాయి. ముఖ్యంగా ఐదు వికెట్ల పెర్ఫామెన్స్‌‌లో వెనుకబడి ఉన్నాడని కొందరు వాదిస్తుంటారు. అయితే ఓవల్‌‌లో ఓటమి అంచున ఉన్న జట్టును ఒంటి చేత్తో గెలిపించిన సిరాజ్‌ తను వర్క్‌‌హార్స్‌‌ మాత్రమే కాదు గేమ్-ఛేంజర్ అని నిరూపించాడు. 

బుమ్రా గైర్హాజరీలో ఇండియా బౌలింగ్ పదును తగ్గుతుందేమోనని భయపడిన వేళ సిరాజ్ నేనున్నానని ముందుకొచ్చాడు. ఆ బాధ్యతను కేవలం స్వీకరించడం కాదు, దానిని శాసించాడు. చేతికి అందిన కొత్త బంతికి తన ఆవేశాన్ని, ఆత్మవిశ్వాసాన్ని జోడించి ప్రత్యర్థికి సవాల్ విసిరాడు.  సిరాజ్ ఎవరినీ అనుకరించడానికి ప్రయత్నించడం లేదు. తను బుమ్రాలా ప్రశాంతంగా ప్రత్యర్థిని దెబ్బతీసే కిల్లర్ కాదు.  షమీలా నిశ్శబ్దంగా శ్రమించే యోధుడు కాదు. అతను వేసే బంతుల్లో ఓ ఎమోషన్‌..  ఓ విధ్వంసం కనిపిస్తుంది. కేవలం వ్యూహంతోనే  కాకుండా తన హృదయంతో బౌలింగ్ చేసి ఫలితం సాధిస్తున్నాడు. విజయానికి 35 రన్స్‌‌..  4 వికెట్లు మాత్రమే అవసరమైన చివరి రోజు ఆట ముందు సిరాజ్ తన ఫోన్‌‌లో ఫుట్‌‌బాల్ దిగ్గజం రొనాల్డో బిలీవ్ అని ఉన్న పోస్టర్‌‌ను వాల్‌‌పేపర్‌‌గా పెట్టుకున్నాడు.  నమ్మకం అనేది నైపుణ్యం కాకపోవచ్చు, కానీ ఆ నమ్మకమే అతనిలో కొత్త శక్తిని నింపింది.

వ్యూహం మార్చి.. చరిత్ర సృష్టించి

ఇంగ్లండ్ బ్యాటర్లు తన నుంచి ఇన్‌‌స్వింగర్లనే  ఆశిస్తారని గ్రహించిన సిరాజ్ అనూహ్యంగా తన ప్లాన్ మార్చాడు. 78 ఓవర్ల ఓల్డ్ బాల్‌‌తో వరుసగా ఔట్‌‌స్వింగర్లు సంధించడం ప్రారంభించాడు. ఈ ఊహించని మార్పుకు ఇంగ్లిష్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఈ తెలివైన వ్యూహంతో కీలకమైన  స్మిత్‌‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వరుసగా తొమ్మిది ఔట్‌‌స్వింగర్ల తర్వాత తనదైన ఇన్‌‌ స్వింగర్‌‌తో అట్కిన్సన్‌‌ను ఎల్బీ చేశాడు. సిరాజ్ కేవలం వ్యూహంతోనే కాకుండా, తన శక్తిని కూడా పూర్తిగా చూపించాడు. ఈ సిరీస్‌‌లోనే తన అత్యంత వేగవంతమైన స్పెల్‌‌ను చివరి ఇన్నింగ్స్‌‌లో వేయడం అతని అంకితభావానికి నిదర్శనం. మ్యాచ్‌‌ను ముగించిన చివరి యార్కర్ గంటకు 143 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ ఒక్క పెర్ఫామెన్స్‌‌తో సిరాజ్ తనపై ఉన్న అన్ని విమర్శలకు సమాధానమిచ్చాడు. తెలంగాణ పోలీస్‌‌ శాఖలో డీఎస్పీ హోదాలో ఉన్న సిరాజ్‌‌.. మైదానంలో తాను మనస్ఫూర్తిగా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈసిరీస్‌లో అన్ని మ్యాచ్‌లూ ఆడి.. అత్యధికంగా 23 వికెట్లు తీసిన సిరాజ్‌   ఇప్పుడు బుమ్రాకు సపోర్ట్ ఇచ్చే సెకండ్ బౌలర్‌‌ మాత్రమే కాదు.  ఇండియా బౌలింగ్‌‌కు నాయకత్వం వహించే సత్తా ఉన్న ‘పేసు గుర్రం’.  ‌‌  

  – వెలుగు స్పోర్ట్స్​ డెస్క్‌