హైదరాబాద్‌ పాతబస్తీలో ఏం జరిగిందో చూడండి.. జస్ట్ మిస్.. అమ్మ చూడకపోయి ఉంటే..

హైదరాబాద్‌ పాతబస్తీలో ఏం జరిగిందో చూడండి.. జస్ట్ మిస్.. అమ్మ చూడకపోయి ఉంటే..

హైదరాబాద్: హైదరాబాద్‌ పాతబస్తీలో అధికారుల నిర్లక్ష్యం ఒక చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. యాకుత్‌పురాలో డ్రైనేజీ మూతను తెరిచి ఉంచడంతో ఒక చిన్నారి స్కూల్‌కు వెళ్తూ డ్రైనేజీలో పడిపోయింది. అయితే.. ఆ పాప తల్లి, స్థానికులు వెంటనే గమనించి మ్యాన్ హోల్లో పడిన ఆ పాపను రక్షించడంతో ప్రమాదం తప్పింది. మ్యాన్ హోల్ను తెరిచి ఉంచిన వారిపై బాధితులు మండిపడ్డారు.

ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది గానీ పొరపాటున పాపకు ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు. మ్యాన్​హోల్​మూత తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని, నిందితులకు జరిమానాతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా పడుతుందని వాటర్​బోర్డు అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అయినా సరే.. సిటీలో కొన్ని చోట్ల ఇలా మ్యాన్ హోల్ మూతలు తెరిచే ఉంచుతుండటం గమనార్హం.

సిటీలో లోతైన మ్యాన్ హోళ్లతో పాటు 25 వేలకు పైగా మ్యాన్ హోళ్లపై ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించారు. మెయిన్​రోడ్లపై ఉన్న వాటిని కవర్స్ తో సీల్ చేసి, రెడ్ పెయింట్​వేశారు. 2023లో కూకట్ పల్లి ప్రగతి నగర్లో నాలుగేళ్ల బాలుడు మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోయి మరణించిన ఘటన హైదరాబాద్ నగర వాసులను కలచివేసింది. వరద నీరును తొలగించాలనే ఆతృత, తొందరపాటులో అవగాహన లేమితో చేసే చర్యలు ప్రాణాలనే బలిగొంటున్నాయి.

ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్ హోళ్లపై ఉన్న మూత తెరచినా, తొలగించినా HMWSSB ACT – 1989, సెక్షన్ 74 ప్రకారం నేరం. దీన్ని అతిక్రమించి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముంది.