ఆరేళ్ల తర్వాత మొదలైన గర్భగుడి దర్శనాలు

ఆరేళ్ల తర్వాత మొదలైన గర్భగుడి దర్శనాలు
  • తెరుచుకున్న యాదాద్రి ప్రధానాలయ తలుపులు
  • సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
  • ఒక్కో గోపురానికి ఒక్కో మంత్రి పూజలు
  • ఆరేండ్ల తర్వాత మొదలైన గర్భగుడి దర్శనాలు

యాదాద్రి / యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి లక్ష్మీనారసింహుడి ప్రధానాలయ తలు పులు తెరుచుకున్నాయి. సోమవారం మహా కుంభ సంప్రోక్షణ ద్వారా ప్రధానాలయంలో దర్శనం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ దంపతులు పూజల్లో పాల్గొని నదీజలాలతో సుదర్శన చక్రానికి అభిషేకం చేశారు. 2016 ఏప్రిల్ 26 నుంచి బాలాలయంలో దర్శనమిచ్చిన నారసింహుడు.. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు గర్భగుడిలో దర్శనమివ్వడంతో ‘నమో నారసింహ’ అంటూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. 

వేడుకలా ఆలయ ప్రారంభం

సరిగ్గా సోమవారం ఉదయం 11:55 గంటలకు మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం మహాకుంభ సంప్రోక్షణ ద్వారా ఆలయాన్ని ప్రారంభించారు. ఉదయం 7:30 గంటలకు బాలాలయంలో నిత్య పూజల అనంతరం.. యాగశాలలో నిత్య హోమాలు, చతుస్థానార్చన పరివార శాంతి ప్రాయశ్చిత్తం తదితర కార్యక్రమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి చేపట్టారు. 
ఆ తర్వాత బాలాలయంలో కుంభ ఉద్వాసన జరిపారు. తర్వాత ప్రధానాలయంలో ఆగమ శాస్త్రం పద్ధతుల్లో గర్తవ్యాసం, రత్నన్యాసం, యంత్ర ప్రతిష్ట, బింబ ప్రతిష్ట, అష్టబంధనం, కళారోహణం, ప్రాణప్రతిష్ఠ, నేతోన్మీలనం, దిష్టికుంభం కైంకర్యాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇక, దివ్యవిమాన గోపురంపై ప్రతిష్టించిన సుదర్శన చక్రానికి  ఉదయం 11:55 గంటలకు నదీజలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించి గుడిని ప్రారంభించారు. ఈ పూజల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సాయంత్రం శాంతి కల్యాణం, ఆచార్య రిత్విక్ సన్మానం, మహాదాశీర్వచనంతో మహాకుంభ సంప్రోక్షణ పూజలకు పరిసమాప్తి పలికారు.

వైభవంగా శోభాయాత్ర

బాలాలయం నుంచి ప్రధానాలయంలోని గర్భగుడిలో లక్ష్మీనారసింహుల కవచమూర్తుల విగ్రహాల ప్రతిష్టాపన కోసం నిర్వహించిన శోభాయాత్ర కన్నులపండువగా జరిగింది. ‌‌మేళతాళాలు, కోలాటాల మధ్య దీన్ని నిర్వహించారు. శోభాయాత్రలో సీఎం కేసీఆర్, శోభ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ లు, విప్‌‌లు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. బాలాలయంలో మహాపూర్ణాహుతి నిర్వహించిన అనంతరం బాలాలయంలోని లక్ష్మీసమేత నారసింహుడి కవచమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కవచమూర్తులను బాలాలయం నుంచి బయటకు తీసుకొచ్చి తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి ప్రవేశించిన కవచమూర్తుల శోభాయాత్ర మాడవీధుల చుట్టూ తిరిగింది. అనంతరం త్రితల రాజగోపురం నుంచి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం మీదుగా ప్రధానాలయ ముఖ మంటపానికి చేరింది. ముఖ మంటపంలో స్వామివారికి పూజలు చేసి.. నరసింహస్వామి కొలువై ఉన్న గర్భగుడిలో కవచమూర్తులను పునఃప్రతిష్టించి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు.

సప్తగోపురాలకు మంత్రుల‌‌ పూజలు

పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా.. సోమవారం ఉదయం సప్తగోపురాలకు నిర్వహించిన సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న ఒక్కో మంత్రికి ఒక్కో గోపురాన్ని కేటాయించారు. దివ్యవిమాన గోపురానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ పూజలు చేయగా.. ఆంజనేయస్వామి ఆలయానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గరుడ ఆళ్వార్ సన్నిధికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంప్రోక్షణ పూజలు చేశారు. తూర్పు రాజగోపురానికి (పంచతల) మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పశ్చిమ రాజగోపురానికి(పంచతల) మంత్రి జగదీశ్​రెడ్డి, దక్షిణ రాజగోపురానికి మంత్రి నిరంజన్ రెడ్డి, ఉత్తర రాజగోపురానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఈశాన్య ప్రాకార మంటపం- 23 కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూజలు నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారి సన్నిధికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు, వాయువ్య ప్రాకార మండపం-18కి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం- 21కి మంత్రి మల్లారెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం- 24 కు మంత్రి హరీశ్​ రావు సంప్రోక్షణ పూజలు చేశారు.  ఆగ్నేయ ప్రాకార మండపం-3కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తూర్పు రాజగోపురానికి(త్రితల) మంత్రి గంగుల కమలాకర్, పశ్చిమ రాజగోపురానికి(సప్తతల) మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఇక మిగతా మండపాలు, అష్టభుజి ప్రాకారాలు, ప్రాకారాలు, యాలీ పిల్లర్లు, బాహ్య ప్రాకారాలు, అంతర్ ప్రాకారాలకు ప్రభుత్వ విప్ లు, పలు కార్పొరేషన్ చైర్​పర్సన్లు, సీఎంవో ఆఫీసర్లు, వైటీడీఏ ఆఫీసర్లు, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు.

ఆరేండ్ల తర్వాత స్వయంభూ దర్శనం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి ఆలయాన్ని కొత్తగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఆలయ ఆఫీసర్లు 2016 ఏప్రిల్ 26న స్వామివారి దర్శనం కోసం బాలాలయం ఏర్పాటు చేసి.. అందులో నారసింహుడి కవచమూర్తులను ప్రతిష్టించి, ప్రాణప్రతిష్ఠ చేసి భక్తులకు దర్శన సదుపాయం కల్పించారు.  2016 ఏప్రిల్ 26 నుంచి 2022 మార్చి 27 వరకు బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ వచ్చారు. దాదాపుగా ఆరేండ్లుగా బాలాలయం నుంచే భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారి కవచమూర్తులను సోమవారం తిరిగి గర్భగుడిలో పునఃప్రతిష్టించారు. మహాకుంభ సంప్రోక్షణ పూజలు పూర్తి కావడంతో.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వయంభూ లక్ష్మీనారసింహుల దర్శనం కోసం భక్తులకు అనుమతించారు. 

126 మెట్లెక్కిన కేసీఆర్​

ప్రధానాలయ గర్భగుడిపైన ఉన్న దివ్యవిమాన గోపురానికి సంప్రోక్షణ పూజలు చేయడానికి సీఎం కేసీఆర్​ దాదాపుగా 126  మెట్లు ఎక్కారు. గోపురంపైకి ఎక్కడానికి అనుగుణంగా పరంజా ఏర్పాటు చేసి తాత్కాలిక మెట్లు రూపొందించారు. ఉదయం 10:52 గంటలకు విమాన గోపురంపైకి ఎక్కిన కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే ఉన్నారు. గంటకు పైగా సుదర్శన చక్రానికి నిర్వహించిన సంప్రోక్షణ పూజల్లో ఆయన పాల్గొని అదే మెట్ల గుండా కిందికి దిగారు. అనంతరం ప్రధానాలయంలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత గర్భగుడిలో స్వయంభువులను దర్శించుకున్న తొలిభక్తుడిగా కేసీఆర్ నిలిచారు.