
- తనను అక్రమంగా ఇరికించారంటూ హైకోర్టులో ఎస్కే జోషి పిటిషన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తూ నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు తనపై చర్యలు తీసుకోకుండా మధ్యం తర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ నివేదికలో తనపై చేసిన ఆరోపణలు అక్రమం, చట్ట, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
చట్టం ప్రకారం సెక్షన్ 8(బి), 8(సి) కింద నోటీసులు ఇవ్వకుండా తనపై ఆరోపణలు చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని జోషి తన పిటిషన్‌లో వివరించారు. మహారాష్ట్ర అభ్యంతరాలతో ముందుకు సాగని ప్రాణహిత- చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మార్చి.. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా దీనిని నిర్మించాలనే చిత్తశుద్ధితో విధులు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు జారీ చేయడంతో తాను హాజరై తనకు తెలిసిన వివరాలన్నింటినీ గుర్తున్నంతవరకు నిజాయతీగా సమాధానాలు ఇచ్చాన్నారు. నివేదికను ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో.. దీని ఆధారంగా తనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని జోషి ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా సీఎస్, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషన్‌ను చేర్చారు. దీన్ని బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.