5 ఎకరాలు..100 కోట్లు: సీలింగ్ ల్యాండ్​ స్వాహాకు స్కెచ్​

V6 Velugu Posted on Feb 11, 2021

వేలల్లో కొని కోట్లు సొమ్ము చేసుకునేందుకు యత్నం
అలంపూర్​లో అక్రమార్కులకు సర్కార్​ లీడర్ల అండ
నిరుపేదలంటూ వెనకేసుకొస్తున్న స్థానిక ఎమ్మెల్యే

గద్వాల, వెలుగు:నిరుపేదలకు ఇచ్చిన సీలింగ్ భూములు అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. కానీ.. గతంలో కొందరు రియల్టర్లు, బడా బాబులు కొన్నారు. కబ్జా పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై కంప్లైంట్స్ రావడంతో కొంతకాలం వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఏకంగా తామే నిరుపేదలం అంటూ కోట్ల విలువ చేసే ల్యాండ్ ను కాజేసేందుకు రెడీ అయ్యారు. స్థానిక లీడర్లు, మంత్రి సపోర్ట్​ఇవ్వడంతో పైరవీలు షురూ చేశారు. ఇందుకు గాను ఓ స్థానిక లీడర్​కు సెంటుకు 10–20 వేలు వరకు వసూలు ముట్టజెప్పినట్లు సమాచారం.

పైరవీలకు రూ.కోటి

అలంపూర్ మండల కేంద్రంలోని చౌరస్తాకు సమీపంలో 250/సి సర్వే నెంబరులో 7.34 ఎకరాల గవర్నమెంట్​ల్యాండ్​ ఉంది. 40 ఏండ్ల క్రితం అందులోని 5 ఎకరాలను పుల్లూరు గ్రామానికి చెందిన ఓ రైతుకు భుదాన్ పథకం కింద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అయితే చౌరస్తా నుంచి అలంపూర్ వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా ఉండటంతో రానురాను ఈ ల్యాండ్​కు వాల్యూ అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం దాదాపు రూ.100 కోట్లు పలుకుతోంది. అయితే 2017లో అలంపూర్ చౌరస్తాలో ఉండే కొందరు రియల్టర్లు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్ఎస్ లీడర్లు, ఇద్దరు ముగ్గురు విలేకర్లను ముందుంచి 5 ఎకరాల సీలింగ్ ల్యాండ్ కబ్జాకు తెరలేపారు. అలంపూర్ లోని ఓ చోటా నాయకుడు మీడియేటర్​గా ఎంచుకుని సెంటు భూమికి 30 వేల వరకు చెల్లించి లీజు పద్ధతిన 99 ఏళ్లు రాయించుకుంటూనే అమ్మి నట్లుగా సంతకాలు తీసుకున్నారు. అలా ఆ ప్లేస్​లో అపార్ట్​మెంట్లు, షాపింగ్ మాల్స్, దాబాలు ప్లాన్​చేసి పనులు స్టార్ట్​చేశారు. ఆ టైంలో కొన్ని ప్రజా సంఘాలు స్పందించి అప్పటి కలెక్టర్ రజత్ కుమార్ సైనీకి కంప్లైంట్​చేశారు. దీంతో అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. కానీ కబ్జాదారుల ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఇక్కడ నిర్మాణాలు చేసుకుంటున్న మేమంతా నిరుపేదలమని, కూలీ చేసుకుంటూ బతుకుతున్నామని, ఈ ల్యాండ్​ను కష్టపడ్డ సొమ్ముతో కొనుక్కున్నామని అధికారులకు చెబుతున్నారు. 40 ఏండ్ల క్రితం నుంచే ఇక్కడ ఉంటున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక నేతలు, మంత్రి సాయంతో ప్రస్తుతం మళ్లీ పైరవీలు స్టార్ట్​చేశారు. పట్టాలివ్వాలంటూ ప్రభుత్వానికి లెటర్లు రాస్తున్నారు. ఇందుకోసం ఓ స్థానిక లీడర్​కి రూ.కోటి దాకా ఇచ్చారనే గుసగుసలు
వినిపిస్తున్నాయి.

పట్టాలొస్తే చాలు..

చౌరస్తాకు సమీపంలో సెంటు భూమి 10 నుంచి 50 లక్షలకు పైనే పలుకుతోంది. ఈ 5 ఎకరాల సీలింగ్​ల్యాండ్ ​వాల్యూ బహిరంగ మార్కెట్​ప్రకారం ప్రస్తుతం సుమారు రూ.100కోట్లు. అదిగాక సమీపంలోనే ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​ఉంది. కమర్షియల్​ వ్యాపారులకు ఎంతో అనుకూలంగా ఉంది. సదరు రియల్టర్లు, నాయకులు, బడా బాబులు పట్టాలొస్తే అమ్ముకుని కోట్లు కొట్టేద్దామని ఉవ్విళ్లూరుతున్నారు.

ప్రజా అవసరాలకే వాడాలె

భూమిని స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికి వాడాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాపాడాల్సిన లీడర్లే కాజేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆఫీసర్లు స్పందించి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సొసైటీ ముసుగులో కుట్ర

ఇటీవల అక్రమార్కులు ఎలాగైనా ఆ భూమిని కొట్టేయాలని కొత్త ప్లాన్ వేశారు. పట్టా పొందాలంటే సొసైటీ ఉండాలని కొందరు సూచించడంతో జోగులాంబ అలంపూర్ చౌరస్తా అభివృద్ధి సేవా సమితి పేరుతో సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. దాని నుంచి ప్రభుత్వానికి అప్లై చేసుకునేందుకు ప్లాన్ వేశారు.

డబ్బులిచ్చి కొన్నవారికే పట్టాలిస్తాం: ఎమ్మెల్యే

ఇటీవల 250/సి సర్వే నెంబరులోని భుమిని ఎవరు కొన్నారో వారికే పట్టాలిస్తామని అలంపూర్ ఎమ్మెల్యే ప్రకటించారు. ఇదే ల్యాండ్​లో తాను కొంతమేర తమ పార్టీ మీటింగుల కోసం చదును చేయించినట్లు చెప్పారు. స్టేట్​లో ఇలాంటి భూములను కొంటున్నారంటూ ప్రకటించారు. ఇలా ఎమ్మెల్యే వ్యాఖ్యలతో వివాదాస్పద ల్యాండ్​ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. కబ్జాదారులకే పట్టాలిస్తామని చెప్పడం వెనుక ఎమ్మెల్యే ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. సీలింగ్ ల్యాండ్ ను ఎవరూ కొనకూడదు.. అమ్మ కూడదని ఎమ్మెల్యేకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

సర్కార్ పరిధిలోనే ఉంది

సీలింగ్ భూములు ప్రస్తుతం సర్కార్ ఆధీనంలోనే ఉన్నాయి. అక్కడ ప్లాట్లు చేసి అమ్ముతున్నారని కంప్లైంట్స్​వచ్చాయి. హ్యాండోవర్ చేసుకున్నాం. ఇప్పటి వరకూ ఎవరికీ పట్టాలు ఇచ్చేలా ఆదేశాలు రాలేదు.                                                                    – లక్ష్మి, ఉండవెల్లి తహసీల్దార్

Tagged ceiling land, Gadwala District, sketch

Latest Videos

Subscribe Now

More News