వారంలో మూడ్రోజులు చదువు.. మరో 3 రోజులు అప్రెంటీస్​షిప్

వారంలో మూడ్రోజులు చదువు.. మరో 3 రోజులు అప్రెంటీస్​షిప్
  • 103 కాలేజీల్లో అమలుకు రెడీ
  • స్కిల్ కౌన్సిల్ సహకారంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో స్కిల్ కోర్సులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటిదాకా మూడేండ్ల డిగ్రీ కోర్సు సదువుకే పరిమితం అయ్యేది. కానీ, ఇక నుంచి ఆ కోర్సులో చేరినవాళ్లకి చదువుతో పాటు నెలకు రూ.10వేల ఇన్​కమ్ కూడా వస్తుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సహకారంతో తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తయారు చేస్తున్నది.

14 కోర్సులు డిజైన్ చేసిన అధికారులు

స్టేట్ లో మొత్తం 1,056 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ప్రస్తుతం బకెట్ సిస్టమ్ రావడంతో చాలా కోర్సులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నాలుగేండ్ల హానర్స్ కోర్సులు స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం చదువుకే పరిమితం అవుతున్నాయి. డిగ్రీ తర్వాత మళ్లీ పీజీ చేయాల్సిన పరిస్థితి. దీంతో చాలామంది పూర్ స్టూడెంట్స్ చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా స్కీమ్​లో భాగంగా స్కిల్ డెవలప్​మెంట్ అండ్ ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌షిప్‌‌ లో కొన్ని కోర్సులు అందిస్తున్నది. సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌‌ (ఎస్ఎస్​సీ) వివిధ విభాగాల్లో కంపెనీలకు, విద్యాసంస్థలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నాయి. దీంట్లో భాగంగా తెలంగాణలోనూ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సహకారంతో దీన్ని 2023–24 విద్యాసంవత్సరంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం 14 కోర్సులు డిజైన్ చేయగా, తెలంగాణలో పది కోర్సులు ప్రారంభించాలని యోచిస్తున్నారు.

37 సర్కార్, 66 ప్రైవేటు కాలేజీల ఎంపిక

స్కిల్ కోర్సులను 103 డిగ్రీ కాలేజీల్లో ప్రారంభించాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయించింది. దీంట్లో 37 సర్కారు కాలేజీలు, 66 ప్రైవేటు కాలేజీలను ఎంపిక చేసింది. ముందుగా ఎక్కువ అడ్మిషన్లున్న కాలేజీల్లో అమలు చేసి, ఆ తర్వాత అన్ని కాలేజీల్లోనూ కంటిన్యూ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని 17 సర్కారు, 39 ప్రైవేటు కాలేజీల్లో స్కిల్ కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఒక్కగ్రేటర్  హైదరాబాద్ పరిధిలోనే 50 కాలేజీలున్నాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో మరో ఐదు కాలేజీలను గుర్తించారు. వీటిలో ప్రధానంగా బీబీఏ రిటైలింగ్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, ఈ కామర్స్ ఆపరేషన్స్, బీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, లాజిస్టిక్స్, హాస్పిటల్ మేనేజ్​మెంట్​ తదితర కోర్సులు ఎంపిక చేశారు.

కాలేజీకి మూడు రోజులే..

బీఏ, బీఎం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల్లోనే కొన్ని సబ్జెక్టులను యాడ్ చేస్తారు. వారంలో మూడు రోజులు కాలేజీకి పోతే, మరో మూడు రోజులు అప్రెంటిస్​కు వెళ్లాల్సి ఉంటుంది. కాలేజీకి దగ్గరలోనే ఆ కోర్సుకు అనుబంధ కంపెనీలు, సంస్థలను గుర్తించి వాటికి పంపిస్తారు. మూడేండ్ల తర్వాత ఆ స్టూడెంట్లకు జాబ్స్ కూడా ఇస్తారు. ఇష్టమైతే అక్కడ చేయొచ్చు.. లేదంటే వేరే చోట జాబ్​లో చేరొచ్చు. ఇలా మూడ్రోజులు అప్రెంటీస్​కు వెళ్లినందుకు గానూ నెలకు రూ.10వేలు స్టూడెంట్​కు ఇవ్వనున్నారు. దీనిద్వారా ఆ విద్యార్థికి ఆర్థికంగా చేయుత లభించనున్నది.

డ్రాపౌట్స్ తగ్గుతయ్ 

ఈ ఏడాది అధికారికంగా స్కిల్ కోర్సులను ప్రారంభిస్తున్నామని స్టేట్​ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్​లింబాద్రి తెలిపారు. 8 యూనివర్సిటీల పరిధిలో 103 కాలేజీలను గుర్తించామ న్నారు. వీటిలో ఒక్కో కాలేజీకి ఒక్కో కోర్సు మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒక కోర్సులో 60 మంది స్టూడెంట్స్ ఉంటారని, వారిని దోస్త్ ద్వారానే భర్తీ చేస్తామన్నారు. డ్రాపౌట్స్ తగ్గుతాయని, పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దీనిపై 28న ఎంపిక చేసిన కాలేజీల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
- ప్రొఫెసర్ లింబాద్రి, టీఎస్ సీహెచ్ఈ చైర్మన్