ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు

ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు

లండన్: ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని యూకేకు చెందిన యూనివర్సిటీ కాలేజ్​ లండన్​ (యూసీఎల్) రీసెర్చర్స్​ తెలిపారు. నిద్రలేమి కారణంగా ప్రతీ మనిషి 2 దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడొచ్చని హెచ్చరించారు. 50ఏండ్ల వయస్సులో 5 గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోతున్న వారిపై స్టడీ చేశారు. వీరు దీర్ఘ కాలిక వ్యాధుల బారినపడే అవకాశాలు 20శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 7 గంటల దాకా నిద్రపోయే వారితో పోలిస్తే.. వారు 25 ఏండ్ల ఏజ్​లో రెండు లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే అవకాశాలు 40శాతం అధికమని అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను యూసీఎల్ ప్రింట్ చేసింది. 

డెత్​ రిస్క్​ ఎక్కువే
హై ఇన్​కం ఉన్న దేశాల్లో దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని స్టడీ లీడ్​ ఆథర్​ సెవెరిన్​ సబియా తెలిపారు. సగానికి పైగా వృద్ధులు కనీసం రెండు దీర్ఘ కాలిక వ్యాధులతో (మల్టీ మోర్బిడిటీ) బాధపడుతున్నారని, ఫలితంగా చాలా మంది హాస్పిటల్స్​లో చేరుతుండటం ప్రజల ఆరోగ్యానికే పెద్ద సవాల్​గా మారిందన్నారు. 50ఏండ్ల వయస్సులో 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే, డెత్​ రిస్క్ 25శాతం పెరుగుతుందని హెచ్చరించారు. ఏజ్​ పెరుగుతున్న కొద్దీ స్లీపింగ్​ టైం మారుతూ ఉంటుందన్నారు. అందుకే ప్రతీ ఒక్కరు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని సబియా సూచించారు. ఇంతకంటే ఎక్కువ పడుకున్నా.. తక్కువ పడుకున్నా.. దీర్ఘ కాలిక వ్యాధుల బారినపడొచ్చని వివరించారు. 25ఏండ్ల వారు ఎంతసేపు– పడుకుంటున్నారు, మరణాలు, దీర్ఘ కాలిక వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటి మధ్య ఉన్న సంబంధాన్ని రీసెర్చర్స్​ పరిశీలించారు.