న్యూఢిల్లీ: ఇండియా సర్వీసెస్ సెక్టార్ వృద్ధి నెమ్మదించింది. ఈ ఏడాది మార్చిలో 14 నెలల కనిష్టానికి తగ్గింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ సర్వే ప్రకారం, ఫిబ్రవరిలో 58.1గా ఉన్న పీఎంఐ ఇండెక్స్, మార్చిలో 57.5కి తగ్గింది. 50 లెవెల్‌కు పైన ఉండడంతో విస్తరణ కొనసాగుతున్నప్పటికీ, కొత్త వ్యాపార ఆర్డర్లు తగ్గడం వలన వృద్ధి వేగం మందగించిందని సర్వే చెబుతోంది.
దీని ప్రకారం, కొత్త ఎగుమతి ఆర్డర్లు మాత్రం గణనీయంగా పెరిగాయి. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ నుంచి డిమాండ్ పెరిగింది. ధరల పరంగా చూస్తే, ఇన్‌పుట్ ఖర్చులు 2022 తర్వాత అత్యధిక స్థాయికి చేరాయి. ఉద్యోగాల పరంగా చూస్తే, వరుసగా మూడో నెలలోనూ నియామకాలు పెరిగాయి. 2025 మధ్యకాలం తర్వాత ఇదే అత్యధిక స్థాయి. బిజినెస్ కాన్పిడెన్స్ పెరగడంతో సంస్థలు భవిష్యత్తుపై ఆశావహంగా ఉన్నాయని సర్వే పేర్కొంది.
