కరోనా ట్రీట్​మెంట్ ​చేయలేం..ఆసక్తి చూపని చిన్న హాస్పిటల్స్

కరోనా ట్రీట్​మెంట్ ​చేయలేం..ఆసక్తి చూపని చిన్న హాస్పిటల్స్

 

  • ఫెసిలిటీస్​ లేక ఆసక్తి చూపని చిన్న హాస్పిటల్స్​
  • ఆక్సిజన్, రెమ్డెసివిర్  కొరతతోనూ ఇబ్బందులు
  • ఇప్పటికే డీఎంహెచ్​ ఆఫీస్​లకు నాట్​ విల్లింగ్​ లెటర్లు

కరీంనగర్​కు  చెందిన రాజుకు ఆరు రోజుల కిందట కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. పెద్దాసుపత్రులకు ఎందుకని అందుబాటులో ఉన్న చిన్న ప్రైవేటు హాస్పిటల్​లో చేరారు. అక్కడ సౌకర్యాలు అన్నీ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. నాలుగు రోజులు అక్కడే చికిత్స అందించారు. ఐదో రోజు ఆక్సిజన్ నిల్వలు లేవు. వెంటనే వేరే ఆసుపత్రికి తీసుకెళ్లండి లేకపోతే కష్టమని అన్నారు. దీంతో చేసేది లేక కుటుంబసభ్యులు సిటీలోని మరో ప్రైవేట్ ​హాస్పిటల్​కు తరలించారు. అక్కడ జాయిన్ అయిన తరవాత కూడా సౌకర్యాల్లో పెద్దగా మార్పులు లేవు. అక్కడా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో హుటాహుటిన హైదరాబాద్​కు తీసుకెళ్లారు.

ఆదిలాబాద్​కు చెందిన ఓ ప్రైవేట్ ​కాలేజీ లెక్చరర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. పది రోజులు గడిచినా తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరేందుకు వెళ్లగా బెడ్లు లేవని చెప్పారు. దీంతో కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తీరా అక్కడ చేరాక రెమ్డెసివిర్ ఇంజక్షన్ కొరత ఉందని, పెషెంట్లే తెచ్చుకోవాలని చెప్పారు. తెలిసిన వాళ్లను సంప్రదించి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఒక్కోటి రూ. 22 వేల చొప్పున ఐదు ఇంజక్షన్లు కొని ట్రీట్మెంట్​ చేయించుకుంటున్నారు. 

వరంగల్/కరీంనగర్, వెలుగు:  కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఐదు, అంతకంటే ఎక్కువ బెడ్లున్న హాస్పిటల్స్​ అన్నింట్లో కరోనా ట్రీట్​మెంట్​ ఇచ్చేందుకు సర్కారు పర్మిషన్​ ఇచ్చింది. అయితే పర్మిషన్లు ఇచ్చే క్రమంలో ఆయా హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​ పాజిబులిటీ, అక్కడి సౌకర్యాలు, ఇతర సదుపాయాలను లెక్కలోకి తీసుకోలేదు. కనీసం ఆయా హాస్పిటల్స్ సుముఖంగా ఉన్నాయో లేదో కూడా కన్ఫామ్​ చేసుకోలేదు. ప్రభుత్వం కరోనా ట్రీట్​మెంట్​కు అనుమతులు ఇచ్చినా తమ దగ్గర తగిన ఫెసిలిటీస్​ లేవంటూ కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్​ వెనకడుగు వేస్తున్నాయి. ఆక్సిజన్​, రెమ్డెసివిర్ ​కొరత, సెపరేట్ ​బెడ్స్, ఇతర పేషెంట్లకు ఎదురయ్యే ఇబ్బందులు, ఇలా వివిధ కారణాల దృష్ట్యా కోవిడ్​ చికిత్సకు తాము సిద్ధంగా లేమంటూ సంబంధిత జిల్లా వైద్యాధికారులకు నాట్ విల్లింగ్​ లెటర్స్​ ఇస్తున్నాయి.

కొత్తగా 1,691 ఆసుపత్రులకు పర్మిషన్​

రాష్ట్రంలో కోవిడ్​ కేసుల ఉధృతి పెరుగుతుండటంతో మరిన్ని బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ బెడ్లు ఉన్న అన్ని ప్రైవేటు హాస్పిటల్స్​లో కరోనా ట్రీట్​మెంట్​అందించేందుకు ఈ నెల 15న నిర్ణయించింది. గతేడాది జూన్​లో రాష్ట్ర వ్యాప్తంగా 244 ప్రైవేటు హాస్పిటల్స్​కు అనుమతులు ఇవ్వగా.. వాటిలో అన్నీ కలిపి 12,973 బెడ్లు ఉన్నాయి. కాగా పేషెంట్లు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఐదు, అంతకంటే ఎక్కువ బెడ్లు ఉన్న హాస్పిటల్స్​ లిస్ట్​ తెప్పించుకుని వాటన్నింటిలో కోవిడ్ ​ట్రీట్​మెంట్​ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 1,691 ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు వచ్చాయి. ఆయా హాస్పిటల్స్​ అన్నింటిలో కలిసి 25,188 ఆక్సిజన్​ సరఫరా లేని నార్మల్ బెడ్స్​, 10,536 ఆక్సిజన్​ బెడ్స్​, 4,608 ఐసీయూ, 1,451 వెంటిలేటర్​ బెడ్స్​ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మొత్తంగా 41,783 బెడ్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.

హాస్పిటల్స్​లో ఆక్సిజన్ ప్రాబ్లమ్​

ప్రభుత్వం కొత్తగా పర్మిషన్​ ఇచ్చినవాటిల్లో చిల్డ్రన్​, మెటర్నటీ, ఆర్థో, డెంటల్​ ఇలా అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్​మెంట్​చేస్తే వారికోసం బెడ్లు సెపరేట్​గా మెయింటెయిన్​ చేయాల్సి ఉంటుంది. కానీ అలా నార్మల్, కోవిడ్​ పేషెంట్స్​కు సెపరేట్​ బెడ్స్​ మెయింటెయిన్​ చేసే కెపాసిటీ లేకపోవడంతో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన చాలా హాస్పిటల్స్​ కోవిడ్ ​ట్రీట్​మెంట్​అందించేందుకు ఆసక్తి చూపడం లేదు. అంతేగాకుండా కోవిడ్​ చికిత్స చేస్తున్నారని తెలిస్తే రెగ్యులర్​పేషెంట్లు వస్తారో లేదోననే సందేహంతో కూడా ప్రైవేటు హాస్పిటల్స్​ వెనుకడుగు వేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా రోగుల కోసం ఆక్సిజన్ ఎక్కువ అవసరం. ఇప్పటికే అంతటా ఆక్సిజన్​తో పాటు రెమ్డెసివిర్​ ఇంజక్షన్​ కొరత వేధిస్తుండం కూడా ప్రధాన సమస్యగా మారింది. సుమారు రూ. 3 వేలకు లభించే రెమ్డెసివర్ ఇంజక్షన్ ప్రస్తుతం బ్లాక్​మార్కెట్​లో రూ. 22 వేలు పలుకుతోంది. ఇక ఎన్ని తిప్పలు పడ్డా చిన్న హాస్పిటళ్లకు ఆక్సిజన్​దొరకడం గగనంగా మారుతోంది. కరీంనగర్ లో ఆక్సిజన్ అందిందే ప్లాంట్లు రెండు ఉండగా.. ఇందులో ఒకటి ప్రస్తుతం పని చేయడం లేదు. దీంతో మొత్తం లోడ్ ఒకే దానిపై పడింది. దీని సామర్థ్యం 20 కెఎల్ ఉంది. గతంలో ఇది వారం రోజులపాటు వచ్చేది. కానీ ప్రస్తుతం రెండు రోజులకు మించి రావడం లేదు. వీరికి సప్లై చేసే కంపెనీలు సైతం అందించడం లేదు. దీన్ని అదనుగా చేసుకుని ఇటు డిస్ట్రిబ్యూటర్లు.. హాస్పిటల్ మేనేజ్ మెంట్లు వీటిని బ్లాక్ చేస్తున్నాయి.  ముఖ్యంగా నగరంలో ఉన్న రెండు ప్రధాన ప్రైవేటు హాస్పిటల్స్ కు మాత్రమే ఎక్కువ మొత్తంలో సిలిండర్లు పోతున్నాయి. మిగిలిన చిన్న ఆసుప్రతుల పరిస్థితి దారుణంగా ఉంది. సిలిండర్లు లేకపోవడంతో.. పేషెంట్లను ఇబ్బంది పెట్టలేక అడ్మిట్ చేసుకోవడం లేదు. గతంలో 40 లీటర్ల సిలిండర్ రూ. 600 ఉండేది. ప్రస్తుతం అత్యవసరం పేరిట రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక అంబులెన్స్ లో పెట్టే సిలిండర్ కూడా గతంలో రూ. 300 ఉండేది. ఇప్పుడు వెయ్యి వరకు తీసుకుంటున్నారు. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటరే ఆసుపత్రులకు వెళ్లి ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం మాకు ఒకటి, రెండు సిలిండర్లు కావాలంటూ ప్లాంట్ దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుంది. చిన్న ఆసుపత్రుల వాళ్లంతా ప్లాంట్ దగ్గర గంటల తరబడి నిలబడినా కనికరించడం లేదు. ఆక్సిజన్ లేకపోవడంతోనే చాలా ఆసుప్రతుల్లో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లయితే మేం ఏం వైద్యం చేస్తామని ఓ చిన్న ఆసుపత్రికి చెందిన ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. 

నాట్​ విల్లింగ్​ లెటర్స్​ ఇస్తున్నరు

వరంగల్​ నగరంలో 171 ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వగా.. అందులో దాదాపు 15 హాస్పిటల్స్​నాట్​ విల్లింగ్​లెటర్లను ఆఫీసర్లకు అందించాయి. ఇందులో తమ వద్ద సరిపడా స్టాఫ్​ లేరని కొంతమంది చెబుతుండగా.. ఆక్సిజన్ కొరత, కోవిడ్​ పేషెంట్లకు చేయాల్సిన టెస్టింగ్​ ఎక్విప్​మెంట్, రెగ్యులర్​ పేషెంట్ల ఇబ్బందులను ఇంకొన్ని హాస్పిటల్స్​పేర్కొంటున్నాయి. కరీంనగర్​లో 98 హాస్పిటల్స్​కు పర్మిషన్​ ఇవ్వగా చాలాచోట్ల పేషెంట్లను చేర్చుకోవడం లేదు. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ నెలకొంది. అయితే ‘నాట్​ విల్లింగ్’  లెటర్లను పరిగణనలోకి తీసుకునేది లేదని, వచ్చిన పేషెంట్లను వెనక్కి పంపకుండా ట్రీట్మెంట్​అందించాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నట్లు జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఆక్సిజన్, రెమ్డెసివిర్​ కొరత, సరైన సదుపాయాలు లేకుండా ట్రీట్​మెంట్ ఎంతవరకు చేయగలరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.