స్టాక్​ మార్కెట్లో ఎస్​ఎంఈల హవా!

స్టాక్​ మార్కెట్లో ఎస్​ఎంఈల హవా!
  •     రెండు నెలల్లో రూ.1,000 కోట్ల సేకరణ
  •     మరిన్ని పబ్లిక్​ ఇష్యూలు వచ్చే చాన్స్​

న్యూఢిల్లీ: స్మాల్​ మీడియా ఎంటర్​ప్రైజెస్​(ఎస్​ఎంఓ)లు స్టాక్​ మార్కెట్ల ద్వారా భారీ ఎత్తున నిధులను సేకరిస్తున్నాయి. ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఫిబ్రవరి 29 నాటికి) మొత్తం 30 ఎస్​ఎంఈ ఐపీఓలు రూ. 1,024 కోట్లు సేకరించాయి. తమ ఖాతాల్లోకి భారీగా నిధులు రావడం వల్ల ఇవి మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని,  సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోగలుగుతాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.  

ఈ ఏడాదిలో ఇప్పటికే 21 కంపెనీలు ఎన్​ఎస్​ఈ ఎస్​ఎంఈ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో లిస్టింగ్‌‌‌‌ని ఎంచుకున్నాయి. మరో 9 బీఎస్​ఈ ఎస్​ఎంఈ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ను ఎంచుకున్నాయి. దీనిని బట్టి చూస్తే మూలధన మార్కెట్ పర్యావరణ వ్యవస్థపై ఎస్​ఎంఈలకు విపరీతమైన ఆసక్తి ఉన్నట్టు చెప్పవచ్చు. సగటు టికెట్​ సైజు దాదాపు 30 శాతం వరకు పెరిగింది.  గత సంవత్సరం డేటాతో పోల్చితే, 180 కంపెనీలు రూ. 4,900 కోట్లను సేకరించాయి. 

యావరేజ్​ టికెట్​సైజు రూ. 27 కోట్లు ఉంది.  ప్రస్తుత సగటు టికెట్​సైజు రూ. 34 కోట్లకు పెరిగింది. పబ్లిక్‌‌‌‌ ఇష్యూకు వెళ్ళిన 30 కంపెనీలలో, 17 క్వాలిఫైడ్​ ఇన్​స్టిట్యూషనల్​ బయర్స్​(క్యూఐబీ) నుంచి గణనీయంగా నిధులను సేకరించాయి. మొత్తం ఐపీఓలలో క్యూఐబీలకు దాదాపు 56శాతం వాటా ఉంది.  ఎస్​ఎంఈలలో సంస్థాగత పెట్టుబడిదారులకు  పెరుగుతున్న ఆసక్తికి ఈ సంఖ్యలు నిదర్శనం. ఎస్​ఎంఈలకు భవిష్యత్​ బాగుంటుందన్న నమ్మకమే ఈ భారీ పెట్టుబడులకు కారణమని చెప్పవచ్చు. 

మాక్స్‌‌‌‌పోజర్ లిమిటెడ్ ఐపీఓ ఏకంగా వెయ్యి రెట్లు ఓవర్‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రయిబ్​అయింది.  ఈ రూ. 20 కోట్ల ఐపీఓకు రూ. 20 వేల కోట్ల విలువైన బిడ్స్​ వచ్చాయి.  ఎస్​ఎంఈ ఐపీఓ ఓవర్‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌లో మాక్స్​పోజర్​ కొత్త రికార్డును నెలకొల్పింది. ఎస్​ఎంఈ ఐపీఓ మార్కెట్ విస్తరిస్తున్నందున, మరిన్ని చిన్న  మధ్య తరహా సంస్థలు తమ వృద్ధి ఆశయాలను సాధించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.