పెద్ద చదువులు చెప్పేటోళ్లకు చిన్న జీతాలు

పెద్ద చదువులు చెప్పేటోళ్లకు చిన్న జీతాలు

పీహెచ్‌డీలు ఉన్నా రూ.20 వేలకు మించని శాలరీ
అరకొర జీతమూ ఆర్నెళ్లు, ఏడాదికోసారి చెల్లిస్తున్న వర్సిటీల ఆఫీసర్లు
పార్ట్ టైం లెక్చరర్లు, అకడమిక్ కన్సల్టెంట్ల అర్ధాకలి జీవితాలు
 యూనివర్సిటీల్లో ఒకే పనికి మూడు రకాల శాలరీలు
 ‘సమాన పనికి సమాన వేతనం’అమలైతలే

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పే పార్ట్ టైం లెక్చరర్లు, అకడమిక్ కన్సల్టెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది. చెప్పుకోవడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా ఉన్నా.. జీతాలు మాత్రం రూ.20 వేలకు మించడం లేదు. అది కూడా ప్రతినెలా కాకుండా ఆరునెలలు, ఏడాదికోసారి చెల్లిస్తున్నారు. దీంతో పార్ట్ టైం లెక్చరర్లు అర్ధాకలి జీవితాలు సాగిస్తున్నారు. పీహెచ్‌‌డీలు పూర్తి చేసి డాక్టరేట్లు, నెట్, సెట్ సాధించినా అందుకు తగిన శాలరీలు రావడం లేదు. సర్కారు జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చెప్పే కాంట్రాక్ట్ లెక్చరర్లకు రూ.50 వేలకు పైగా శాలరీలు ఇస్తున్న ప్రభుత్వం.. పీజీ కాలేజీల్లో చెప్పే లెక్చరర్లకు మాత్రం రూ.20 వేలు కూడా ఇవ్వడం లేదు. పీజీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు (ఎస్ఎఫ్‌‌సీ) బోధించే పార్ట్ టైం లెక్చరర్ల పరిస్థితి మరీ దారుణం. 
కొత్త కోర్సులన్నీ ఎస్ఎఫ్‌‌సీ పద్ధతిలోనే
రాష్ట్రంలో క్యాంపస్ లు, అనుబంధ కాలేజీలు కలిగిన ఉస్మానియా, కాకతీయ, జేఎన్ టీయూ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో పదుల సంఖ్యలో కోర్సులు నిర్వహిస్తున్నారు. ఆయా యూనివర్సిటీల్లో గత పది, పదిహేనేళ్లలో కొత్తగా ప్రారంభించిన పీజీ కాలేజీల్లో కోర్సులన్నీ రెగ్యులర్ మోడ్ లో కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగానే ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ కోర్సులు బోధించేందుకు ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను, నిధులను మంజూరు చేయలేదు. దీంతో స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ వస్తేనే ఆ కోర్సులు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి. యూజీసీ రూల్స్ ప్రకారం ఏదైనా ఒక కోర్సును ఐదేళ్లపాటు సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తే రెగ్యులర్ కోర్సుగా మార్చాల్సి ఉంటుంది. కానీ యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి అధికారులు రెగ్యులర్ కోర్సుల మాటెత్తడం లేదు.
రాష్ట్రంలో 800 మందికి పైనే..
యూనివర్సిటీల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పార్ట్‌‌టైం లెక్చరర్లు, అకడమిక్ కన్సల్టెంట్లు అనే నాలుగు రకాల హోదాల్లో అధ్యాపకులు పని చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 11ను విడుదల చేసింది. కానీ ఈ జీవోను కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకే వర్తింపజేస్తూ వారి శాలరీని రూ.50 వేలకుపైగా పెంచిన ప్రభుత్వం.. పార్ట్‌‌టైం లెక్చరర్లు, అకడమిక్ కన్సల్టెంట్లను మాత్రం పట్టించుకోలేదు. పేరుకు పార్ట్ టైం లెక్చరర్లు అయినా ఉదయం నుంచి సాయంత్రం దాకా కాలేజీల్లో ఉండాల్సిందే. ఓయూ పరిధిలో 418 మంది, కేయూ పరిధిలో 220 మంది, మహత్మాగాంధీ యూనివర్సిటీలో 28 మంది, శాతవాహన పరిధిలో 17 మంది, తెలుగు యూనివర్సిటీ, తెలంగాణ, పాలమూరు యూనివర్సిటీల్లో మరో వంద మంది వరకు పార్ట్ టైం లెక్చరర్లుగా, అకడమిక్ కన్సల్టెంట్లుగా పని చేస్తున్నారు. యూనివర్సిటీల్లో రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెల జీతం రూ.లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వస్తుండగా, కాంట్రాక్ట్ లెక్చరర్లు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు అందుకుంటున్నారు. వీరిలాగే ఫుల్ వర్క్ లోడ్ తో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పని చేస్తున్న పార్ట్‌‌టైం లెక్చరర్లు, అకడమిక్ కన్సల్టెంట్లకు మాత్రం యూనివర్సిటీకో తీరుగా రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారు. యూజీసీ రూల్ ప్రకారం.. పీరియడ్ కు రూ.1,500 చెల్లించాల్సి ఉండగా కేయూలో ఒక్కో పిరియడ్ కు రూ.450, ఓయూలో రూ.600, ఇతర యూనివర్సిటీల్లో రూ.700 చెల్లిస్తున్నారు. దీంతో వీరికి నెల జీతం రూ.15 వేల నుంచి రూ.20 వేల లోపే ఉంటోంది. 
ప్రత్యేక రాష్ట్రం వచ్చినంకనే కష్టాలు
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఫుల్ వర్క్ లోడ్ ఉన్న ప్రతి పార్ట్ టైం లెక్చరర్.. తన అర్హతను బట్టి ఆటోమేటిగ్గా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా అప్ గ్రేడ్ అవుతుండేవారు. ఇప్పుడు యూనివర్సిటీల్లో పని చేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లలో 90 శాతం మంది అంతకుముందు పార్ట్ టైం లెక్చరర్లుగా పని చేసినవారే. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఓయూ, కేయూ, మహత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల్లో ఫుల్ వర్క్ తో ఏడేళ్లుగా పని చేస్తున్నా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా అప్ గ్రేడ్ చేయడం లేదు.
తెలంగాణ వచ్చాక ఉన్న ఉద్యోగం పోయింది
నేను ఓయూ కోఠి ఉమెన్స్ కాలేజీ, నిజాం కాలేజీలో హిస్టరీ పార్ట్ టైం లెక్చరర్ గా 16 ఏళ్లుగా పని చేస్తున్నా.  2014 ఆగస్టులో అసిస్టెంట్‌ ప్రొఫెర్(కాంట్రాక్ట్)గా నాతో పాటు 35 మందిమి సెలక్టయ్యాం. కానీ తెలంగాణ ఏర్పాటైన జూన్ 2, 2014 తర్వాత కాంట్రాక్ట్ నియామకాలు చెల్లవని రాష్ట్ర  ప్రభుత్వం అదే నెలలో సర్క్యులర్ జారీ చేయడంతో మేం సెలక్టయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రద్దయిపోయాయి. దీంతో మళ్లీ పార్ట్ టైం లెక్చరర్ గానే కొనసాగాల్సి వస్తోంది. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని కొట్లాడితే.. మాకు వచ్చిన ఉద్యోగాలు పోయాయి.                                                               - డాక్టర్ కందుల గోవింద్, పార్ట్ టైం లెక్చరర్, నిజాం పీజీ కాలేజీ
అందరికీ ఒకే పేస్కేల్ ఇయ్యాలె
16 పీరియడ్ల ఫుల్ వర్క్ లోడ్‌‌తో పని చేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లను కేయూలో అప్పటి వీసీ వెంకటరత్నం కాంట్రాక్ట్ లెక్చరర్లుగా నియమించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇతర శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం..వర్సిటీల్లో మాత్రం ఫుల్ వర్క్ లోడ్ కలిగిన పార్ట్ టైం లెక్చరర్లను కాంట్రాక్ట్ లెక్చరర్లుగా గుర్తించడం లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఒకలా, రెగ్యులర్ కోర్సులకు మరోలా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఒకే విధమైన పేస్కేల్ అమలు చేయాలి. - సోల్తీ కిరణ్ గౌడ్, 
కేయూ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్

హైదరాబాద్‌‌లో బతికేదెట్లా?
ఓయూ సైఫాబాద్ పీజీ కాలేజీలో బాటనీ విభాగంలో 2015 నుంచి పని చేస్తున్నా. పీహెచ్‌‌డీ పూర్తయింది. సెట్ క్వాలిఫై అయ్యాను. పీరియడ్ కు రూ.700 చొప్పున ఇస్తున్నారు. క్లాసులు జరిగేది 8 నెలలే. సెలవుల వల్ల జనవరిలో 15 రోజులు, అక్టోబర్ లో 15 రోజులే క్లాసులు జరుగుతాయి. మొత్తంగా నెల జీతం రూ.20 వేల నుంచి 23 వేలకు మించడం లేదు. ఈ జీతంతో హైదరాబాద్‌‌లో భార్య, ఇద్దరు పిల్లలతో బతకడం కష్టంగా మారింది.
- ఆర్.సునీల్ కుమార్, పార్ట్ టైం లెక్చరర్