
యాదాద్రి, చౌటప్పల్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం ఆత్మకూరు(ఎం) మండలంలో ఆయన ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత సమయంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలన్నారు. ఇండ్లకు సంబంధించిన మెటీరియల్ ను తెచ్చుకోవడానికి డబ్బులు లేకపోతే మహిళా సంఘాల ద్వారా లోన్ ఇప్పించి ఇండ్ల పనులు చేపట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వం జమ చేసిన తదుపరి తిరిగి చెల్లించవచ్చని సూచించారు.
నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అనంతరం మహిళా సమాఖ్య ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈనెల 10 నుంచి నిర్వహించే ఇందిరామహిళా శక్తి విజయోత్సవాలను సంబురంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. అంతకుముందు చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
విలేజ్ సెక్రటరీ సస్పెన్షన్..
బీబీనగర్ మండలం కొండమడుగు సెక్రటరీ అలివేలును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. సెక్రటరీ అలివేలు పలు అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు రావడంతో ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎంపీవో మాజిద్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని పేర్కొన్నారు. కొండమడుగులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డీప్యూటీ సీఈవో విష్ణువర్ధన్ రెడ్డిని ఆదేశించారు.