సమ్మర్​ బిజినెస్​ డౌన్​ : కూలర్లు అమ్ముడుపోతలేవు​..  జ్యూస్‍ సెంటర్లు నడుస్తలేవు

సమ్మర్​ బిజినెస్​ డౌన్​ :  కూలర్లు అమ్ముడుపోతలేవు​..  జ్యూస్‍ సెంటర్లు నడుస్తలేవు
  • సమ్మర్​ బిజినెస్​ డౌన్​
  • కూలర్లు అమ్ముడుపోతలేవు​..  జ్యూస్‍ సెంటర్లు నడుస్తలేవు
  • మార్చి రెండో వారం నుంచి వరుసగా చెడగొట్టు వానలు 
  • చలి,వాన కాలాలను తలపిస్తున్న వాతావరణం 
  • ఇప్పటికే రెండు నెలల బిజినెస్ లాస్ 
  • మే నెలపైన వ్యాపారుల ఆశలు

వరంగల్‍, వెలుగు:  రాష్ట్రంలో అకాల వర్షాల  ఎఫెక్ట్​ రైతులతో పాటు  సమ్మర్‍ బిజినెస్‍ చేసుకునే చిరు వ్యాపారులపై కూడా పడింది.  మార్చి, ఏప్రిల్‍ నెలలు వచ్చాయంటేనే ఎండలు భగభగమనేవి.   ఎండవేడి తట్టుకోలేక  జనాలు కొబ్బరి బొండాలు, చెరుకు రసాలు, జ్యూస్‍లు ఎక్కువగా తాగేవారు.  ఉడుకపోతను తట్టుకునేందుకు కూలర్లు, ఏసీలు  కొనేందుకు క్యూ కట్టేవారు.  ఈసారి మాత్రం సీజన్‍ అంతా తలకిందులైంది. టెంపరేచర్​ పెరగాల్సిన మార్చి రెండో వారం నుంచే అకాల వర్షాలు మొదలయ్యాయి.  వరుసపెట్టి దంచుతున్నాయి. ఉడుకపోత సమయాల్లోనూ చలికాలం లెక్క  వాతావరణం వణికిస్తోంది.  దీంతో సమ్మర్‍ సీజనల్‍ బిజినెస్‍ చేసుకునే వేలాది మంది చిరు వ్యాపారులు, వారిపై ఆధారపడ్డ సిబ్బంది రోడ్డునపడ్డట్లయింది. 

10 కూలర్లు కూడా అమ్ముడపోతలేవ్​.. 

ప్రతీ రోజూ వానలు కొడుతుండడంతో వాతావరణం చల్లగా మారింది. రాష్ట్రంలో ఏటా వందల కోట్ల కూలర్ల బిజినెస్‍ నడవగా.. ఈసారి వ్యాపారులు తలలు పట్టుకున్నారు. గ్రేటర్‍ వరంగల్ వెయ్యిస్తంభాల గుడి ఏరియాలో సమ్మర్​ వచ్చిదంటే కూలర్‍ షాపులు  హోల్‍సేల్‍, రిటైల్‍ కస్టమర్లతో కిటకిటలాడేవి.  ఒక్కో షాపులో దాదాపు 40 నుంచి 50 మంది సిబ్బంది పనిచేసేవారు.  ప్రతీరోజూ దాదాపు 100 నుంచి 120 వరకు కూలర్లు అమ్మేవారు. కూలర్లు ట్రాన్స్​పోర్ట్​ చేయడానికే పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ఇక్కడ ఉపాధి పొందేవారు.  అలాంటిది ఇప్పుడు ఈ ప్రాంతంలోని షాపులన్నీ కుల్లాగా ఉంటున్నాయి.  ఒక్కో షాపులో  రోజుకు10 కూలర్లు కూడా అమ్ముడుపోవడంలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కొనుగోళ్లు లేక స్టాక్‍ అలానే ఉండిపోయింది.  సిబ్బందికి జీతాలిచ్చే పరిస్థితుల్లేక ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఐదారుగురితో మేనేజ్‍ చేస్తున్నారు. 

చిరువ్యాపారాలు నడవట్లే..

సమ్మర్​ వచ్చిందంటే  చిరువ్యాపారాలు జోరుగా నడుస్తాయి.   ఈ సీజన్​లో వాతావరణం చల్లగా ఉండడంతో  చెరుకు రసం, జ్యూస్‍ సెంటర్లు,  ఐస్‍క్రీం బండ్లు, కొబ్బరి బొండాల షాపులు వెలవెలపోతున్నాయి. అకాల వర్షాలు తమ ఉపాధిపై దెబ్బ కొట్టాయని వాపోతున్నారు.  మే నెల.. రోహిణి కారై పైనే ఆశలు..మాములుగా ఫిబ్రవరి చివరి వారంలో ఎండలు మొదలై మార్చి రెండో వారం నుంచి సమ్మర్​ బిజినెస్‍లు ఊపందుకుంటాయి. దీనికి అనుగుణంగానే వ్యాపారులు ప్లాన్‍ చేసుకుంటారు. కాగా, సరిగ్గా బిజినెస్‍ స్టార్ట్​ అయ్యే మార్చిలోనే అకాల వర్షాలు మొదలు కావడంతో రెండు నెలల బిజినెస్‍ నష్టపోయారు.  కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింది.  దీంతో  వ్యాపారులంతా మే నెల, రోహిణి కార్తె బిజినెస్‍పై ఆశతో ఉన్నారు. 

టెంపరేచర్‍ 40 దాటితేనే బిజినెస్‍..

కూలర్లకు గిరాకీ రావాలంటే మినిమం టెంపరేచర్‍ 40 దాటాలే.  ఎండాకాలం వచ్చిందంటే ఇది కూడా దాటుతది. ఈసారి అనుకోని వానలతో టెంపరేచర్‍ 32లోపు ఉంటే జనాలు ఫ్యాన్‍ గాలి చాలనుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు తగ్గినయ్‍.  గత సీజన్లతో పోలిస్తే ఈ ఏప్రిల్‍ నెల బిజినెస్‍  బాగా దెబ్బతింది.  

.- మహ్మద్‍ ఇస్మాయిల్‍, యునికాన్‍ మేనేజింగ్‍ డైరెక్టర్‍

రిపేర్ల కోసం ఎవ్వరూ రావట్లే 

మేం పదేండ్లుగా కూలర్ల అమ్మకాలు, రిపేర్ల షాప్‍లో ఉంటున్నా. ఎప్పుడూ ఇలాంటి సీజన్‍ చూడలేదు. ఎండా కాలమొస్తే చుట్టుపక్కల గ్రామాలోళ్లు మా దగ్గరే కొనేవారు.  రోజూ కనీసం ఐదారైనా అమ్మేటోళ్లం. పాత కూలర్లు 10, మరో ఐదు ఫ్యాన్లు రిపేర్‍ చేసేటోళ్లం. ఈసారి కొత్తవి కొనేటోళ్లు రావడంలేదు.  వాటిని దాచే గోదాం కిరాయి మీదపడుతోంది. పోనీ రిపేర్లు చేసుకుందామా అంటే వాడకం లేదు కాబట్టి కనీసం రోజుకో గిరాకీ కూడా రావట్లేదు. 

ఆసీఫ్‍ పాషా, పెగడపల్లి డబ్బాలు​, హనుమకొండ

ఇంత తక్కువ సీజన్‍ ఎప్పుడూ లేదు..

నేను 30 ఏండ్లుగా పండ్ల వ్యాపారం చేస్తున్నా. ఈ ఏడాది ఎండా కాలంలో అమ్మినంత తక్కువ కొబ్బరి బొండాలు, పండ్లు ఇంతకుముందెప్పుడు అమ్మలేదు.  కొబ్బరి నీళ్ల కోసం కస్టమర్లు లైన్‍ కట్టేది. కాయలు కొట్టలేక చేతులు నొప్పి పెట్టేవి. ఈసారి ఆ పరిస్థితి లేదు. మామిడి కాయలు కూడా వానలకు రాలడంతో కొంటలేరు. నాలాంటి చిన్న వ్యాపారం చేసుకునేటోళ్లకు ఈ సీజన్‍ దెబ్బతీసినట్లే.

- ఎన్‍.రాజయ్య , హనుమాన్‍నగర్‍, హనుమకొండ