అక్కడ లాక్ డౌన్.. భారీగా పెరగనున్న టీవీ, స్మార్ట్ ఫోన్‌ ధరలు ?

అక్కడ లాక్ డౌన్..  భారీగా పెరగనున్న టీవీ, స్మార్ట్ ఫోన్‌ ధరలు ?

రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడుస్తున్నా కరోనా మాత్రం మనల్ని వదలడం లేదు. ఏదో ఓ రూపంలో మనపై ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి చైనాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం అందర్నీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో  చైనాలోని టెక్ హబ్‌ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన షెన్‌జెన్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఒకవేళ షెన్‌జెన్‌లో లాక్‌డౌన్ విధిస్తే.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను సరఫరా చేసే నగరాల్లో షెన్‌జెన్ ఒకటి. అక్కడి నుంచే 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు భారత్‌కు దిగుమతి అవుతుంటాయి. దీంతో షెన్‌జెన్‌లో కరోనా కేసులు మరికొన్నిరోజులు ఇలాగే కొనసాగితే అధికారులు లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ లాక్ డౌన్ మూడు వారాలు దాటితే మన దేశంలోకి వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై ప్రభావం పడుతుందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ రీసెర్చ్ డైరెక్టర్ నవ్‌కేంద్రసింగ్ వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచదేశాలు తీవ్రమైన చిప్‌ కొరతను ఎదుర్కోవడంతో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల ఉత్పత్తి భారీగా పడిపోయింది.