
- సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ సేఫ్ చాట్ లింక్స్
- స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు
- ఫేక్ ‘సేఫ్ చాట్’ యాప్‌ను గుర్తించిన ‘సైఫర్మా’ రీసెర్చ్
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఇప్పుడు హ్యాకింగ్ భయం వెంటాడుతున్నది. సోషల్ మీడియా, మెసేజ్‌ల రూపంలో వచ్చే యాప్స్ లింక్స్ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ డేటాను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేశారు. పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్లు, ఫొటోలు, ఫోన్ నంబర్లు దొంగిలించడానికి హైటెక్ యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం ‘సేఫ్ చాట్’ పేరుతో రూపొందించిన నకిలీ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లను డేటాను హ్యాక్ చేసేందుకు రెడీ అయ్యింది. మాల్‌వేర్‌తో క్రియేట్ చేసిన ఫేక్ సేఫ్‌చాట్ లింక్స్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ‘సైఫర్మా’ గుర్తించింది. బ్లీపింగ్ కంప్యూటర్ డాట్ కమ్ సైట్‌లో ఆ వివరాలు వెల్లడించింది.
ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేసిన ‘బహముత్
ఇంటర్నేషనల్ సైబర్ హ్యాకింగ్ గ్రూప్ ‘బహముత్’ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేసింది. గతంలో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్) పేరుతో ఫేక్ కంప్యూటర్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేసింది. కార్పొరేట్ కంపెనీల డేటాను హ్యాక్ చేసింది. ఫేక్ వీపీఎన్ గతేడాది ఈ సెట్ యాంటీ వైరస్ సంస్థ గుర్తించింది. దీంతో బహముత్ మరో హ్యాకింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, సిగ్నల్ తరహాలో ఫేక్ సేఫ్‌చాట్ యాప్‌ను క్రియేట్ చేసింది. సోషల్ మీడియా, మెసేజ్‌ల ద్వారా ఈ యాప్ లింక్స్ ను సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టింది. సేఫ్ చాట్ ద్వారా సైబర్ సెక్యూరిటీ ఉంటుందని లింక్‌లో నమ్మిస్తోంది. కొత్త చాటింగ్ అప్లికేషన్ అని, బెస్ట్ ఫీచర్స్ అందిస్తున్నట్లు చెప్పి యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది.
మొబైల్ హ్యాకింగ్ ఇలా..
ఏపీటీ(అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ టెక్నికల్) బహముత్ గ్రూప్ గతంలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ‘డునాట్’ అనే ఫేక్ యాప్‌ను సర్క్యులేట్ చేసింది. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన స్మార్ట్ ఫోన్లలోకి మాల్‌వేర్ పంపించి హ్యాక్ చేసింది. ప్రస్తుతం ఫేక్ సేఫ్‌చాట్ యాప్ ద్వారా ఇలాంటి పనే చేస్తోంది. ఈ యాప్ లింక్స్ ను సర్క్యులేట్ చేస్తూ ఇన్ స్టాల్ చేసిన వారి ఫోన్లలోకి మాల్ వేర్‌ను పంపి హ్యాక్ చేస్తోంది. వాట్సాప్ డేటాను చోరీ చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో వాట్సాప్ యూజర్లు డేంజర్లో పడే ప్రమాదముంది. ఈ సేఫ్ చాట్ నకిలీ యాప్‌లో ఒరిజినల్ యాప్ తరహాలోనే ఫీచర్స్ ఉన్నాయి. లింక్ ఓపెన్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ మెయిన్ మెనూ వస్తుంది. ఇందులో పర్మిషన్స్ ఫీచర్స్‌లోకవర్లామ్ మాల్‌వేర్ ఉంటుంది. లింక్ ఓపెన్ చేసిన వెంటనే స్మార్ట్‌ఫోన్‌లోకి మాల్‌వేర్ ఎంటర్ అవుతుంది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే క్రమంలో యూజర్ నుంచి పర్మిషన్స్ తీసుకుంటుంది. ఇలా మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్టులు, మెసేజెస్, కాల్‌డేటా, ఎక్స్ టర్నల్ డివైస్ స్టోరేజ్, జీపీఎస్ లొకేషన్ సహా మొత్తం కీలక ఫీచర్ల యాక్సెస్‌ను ఈ యాప్ కోరుతుంది.
హ్యాక్ చేసిన డేటా.. డార్క్ వెబ్ సైట్‌లో అమ్మకానికి..
ఇలా హ్యాకింగ్‌కు గురైన ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ సబ్‌సిస్టమ్‌లోకి చొరబడేందుకు స్పై వేర్ వైరస్ ప్రయత్నిస్తుంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోకి స్పై వేర్ ఎంటర్ అయిన తర్వాత డివైజ్ మొత్తాన్ని హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. యూజర్ల కీలక డేటాను హ్యాక్ చేస్తారు. ఓటీపీ నంబర్ల ద్వారా బ్యాంక్ అకౌంట్లను కొల్లగొడతారు. పర్సనల్ డేటాను డార్క్‌వెబ్‌లో సేల్ చేస్తారు. ఫోన్ నంబర్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడతారు. ఇలా వాట్సాప్ లాంటి చాటింగ్ యాప్స్‌ను సైతం టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్ల డేటా చోరీ చేస్తున్నట్లు ‘సైఫర్మా’ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.
హ్యాకర్‌ను గుర్తించలేం
ఒరిజినల్ సేఫ్ చాట్ తరహాలోనే ప్రస్తుతం ఫేక్ సేఫ్ చాట్ యాప్ లింక్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ లింక్స్‌ను సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారు. వాటిని ఓపెన్ చేయగానే స్మార్ట్ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారు. మన ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించలేం. హ్యాకర్లు ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారో కూడా ట్రేస్ చేయడం కష్టం. లింక్స్ ద్వారా వచ్చే అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసుకునేప్పుడు స్మార్ట్ ఫోన్లో ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు. – విశ్వనాథ్, ఎథికల్ హ్యాకర్