- సీఎం సెక్రటరీ, ఇరిగేషన్, భగీరథ బాధ్యతల నుంచి తొలగింపు
- ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా
- ఒక్కరోజే 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన రాష్ట్ర సర్కార్
- సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి, ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు నియామకం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. బుధవారం ఒక్కరోజే 26 మంది ఆఫీసర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం సెక్రటరీలను నియమిస్తూ మరో జీవోను ప్రభుత్వం జారీ చేసింది. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన, ఇరిగేషన్ అదనపు బాధ్యతలను చూస్తున్న స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేసింది.రూరల్ వాటర్ సప్లై(మిషన్ భగీరథ) సెక్రటరీ పోస్టు నుంచి కూడా ఆమెను తప్పించింది. ఆ స్థానంలో సందీప్ కుమార్ సుల్తానియాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఏడీ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాను ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్ చేసింది.
కలెక్టర్లనూ మార్చిన్రు
మహబూబాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె.శశాంకను రంగారెడ్డి కలెక్టర్‌గా ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఆయన స్థానంలో మహబూబాబాద్ కలెక్టర్‌గా అద్వైత్ కుమార్ సింగ్‌ను నియమించింది. సంగారెడ్డి కలెక్టర్ శరత్‌ను ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా.. లేబర్ కమిషనర్‌గా ఉన్న అహ్మద్ నదీంను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ఇక లేబర్ డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్యను అపాయింట్ చేసింది. టీఎస్పీఎస్సీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా ఉన్న బీఎం సంతోష్‌ను జోగులాంబ గద్వాల కలెక్టర్‌గా నియమించగా.. అక్కడ ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న వల్లూరు క్రాంతిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేశ్ దత్ ఎక్కాను నియమించింది. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్, మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్న దాసరి హరిచందనను నల్గొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆమె స్థానంలో డి.దివ్యను నియమించింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న భారతి హోళికేరి.. ఆర్కియాలజీ డైరెక్టర్ గా నియమితులయ్యారు. విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి అపాయింట్ అయ్యారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి ఓఎస్డీగా ఉన్న కృష్ణ భాస్కర్‌కు ఆర్థిక శాఖ, ప్లానింగ్ స్పెషల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
సీఎంఓలోకి మరో ముగ్గురు
ముఖ్యమంత్రి సెక్రటరీగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన నిన్నటిదాకా స్టేట్ ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. -స్టాంపుల విభాగంలో జాయింట్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న వేముల శ్రీనివాస్‌ను సీఎం ఓఎస్డీగా నియమించింది. ఎస్.సంగీత సత్యనారాయణను సీఎంఓ జాయింట్ సెక్రటరీగా అపాయింట్ చేసింది. ఇప్పటికే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి, సెక్రటరీగా షానవాజ్ ఖాసీం, స్పెషల్ సెక్రటరీగా అజిత్ రెడ్డిని నియమించారు. ఇక సీఎం పీఎస్, అడిషనల్ పీఎస్, పీఆర్ఓలకు సంబంధించి ఉత్తర్వులు రావాల్సి ఉంది.
కీలక శాఖలు చూసినోళ్లు ఔట్
గత సర్కార్‌లో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్‌లు, ఇతర ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరిగా బదిలీ చేస్తూ వస్తున్నది. ఇప్పటికే స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్‌ను డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు పంపింది. సీఎం సెక్రటరీగా, ఇరిగేషన్ సెక్రటరీ అదనపు బాధ్యతలు, మిషన్ భగీరథ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్‌ను అన్నింటి నుంచి తప్పించి.. పెద్దగా పనిలేని ఫైనాన్స్ కమిషన్‌కు పంపింది. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన్ను ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా ఆమె కలవలేదు. గత ప్రభుత్వంలో సీఎస్, మంత్రులు, ఇతర సీనియర్ అధికారుల ఫోన్లు కూడా ఆమె లిఫ్ట్ చేసేవారు కాదని పలువురు ఐఏఎస్‌లు చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక సంగారెడ్డి కలెక్టర్‌ను ట్రైబల్ వెల్ఫేర్‌కు బదిలీ చేయగా.. గతంలో మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్న మరో ముగ్గురు, నలుగురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కొన్ని రోజుల్లో బదిలీ చేయనున్నట్లు తెలిసింది.
